
మహిళకు మద్యం తాగించి.. హత్య చేసి..
తమతో కలిసి పనిచేసే మహిళ నగలపై కన్నేసిన మేసీ్త్రలు ఆమెను హతమార్చి, వాటిని కాజేశారు.. అనంతరం మృతదేహాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని కొత్తపల్లి గ్రామ అక్కపల్లి చెరువులో పడేసిన ఘటన మంగళవారం వెలుగుచూసింది.
అన్నారం గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నారం గ్రామానికి చెందిన బెరికి నర్సవ్వ (38) కామారెడ్డిలోని అడ్డమీదికి ప్రతీరోజు కూలి పనికి వెళ్తుంది.
రోజూ మాదిరిగానే గత శనివారం వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై, కామారెడ్డి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
కూలి పనికి ఎక్కడికి వెళ్తుందో తెలుసుకొని, రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం రాజుపేట గ్రా మానికి చెందిన ప్రకాశ్, ఎల్లయ్య, సుకన్యలను అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో హత్య ఘటన వెలుగు చూసిందని కామారెడ్డి సీఐ నరేశ్ తెలిపారు. నర్సవ్వ మీదున్న 4 తులాల బంగారు ఆభరణాల కోసమే ఆమెను చంపేసినట్లు తెలుస్తోందన్నారు.
నర్సవ్వకు రామారెడ్డిలో మద్యం తాగించి, అనంత రం గొంతునులిమి హత్య చేసి, మృతదేహాన్ని డ్రమ్ములో పెట్టి, అక్కపల్లి చెరువులో పడేశారన్నారు.
మృతురాలి భర్త సౌదీలో ఉన్నాడని తెలిపారు. ఆమెకు కుమార్తె, కుమారుడు ఉన్నారని పేర్కొన్నారు.
లింగన్నపేటలో బంధువుల ఆందోళన
పోలీసులు తమకు న్యాయం చేయడం లేదని, మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులు, అన్నారం గ్రామస్తులు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట ప్రధాన చౌరస్తాలో మంగళవారం ఆందోళన చేపట్టారు.
అమాయకురాలైన నర్సవ్వను పనికి తీసుకెళ్లి, బంగారం దోచుకోవడంతోపాటు దారుణంగా హత్య చేసి, చెరువులో పడేశారన్నారు. నేరస్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.