
చాన్నాళ్ల కిందట మూత పడిన ఓ బయోడీజిల్ ట్యాంకులోకి దిగిన ఇద్దరు యువకులు అనుమానాస్పద స్థితిలో దుర్మరణం పాలయ్యారు. వారు ఊపిరాడక చనిపోయారని స్థానికులు చెబుతూండగా..
ఎవరో ఉద్దేశపూర్వకంగానే వారిని హత్య చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటన వివరాలివీ.. కాజులూరు మండలం ఆర్యావటం గ్రామానికి చెందిన తాతపూడి మహేష్ (25), శీల గ్రామానికి చెందిన నేరేడుమిల్లి శివకుమార్(25) గొల్లపాలెంలోని ఒక లారీలో డ్రైవర్, క్లీనర్‌గా పని చేస్తున్నారు. గొల్లపాలెంలోని కాజులూరు రోడ్డులో ఆంజనేయ ట్రేడర్స్ పేరుతో గతంలో బయోడీజిల్ బంక్ ఉండేది. ఇది ఆరు నెలల క్రితం మూత పడింది. ఈ నేపథ్యంలో ఆ బంకు నిర్వాహకులు ఆ బయోడీజిల్ ట్యాంకును బయటకు తీసి ఓ పక్కన పడేశారు.
ఆ ట్యాంకు అడుగు భాగంలో కొద్దిగా డీజిల్ ఉంది. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మహేష్, శివకుమార్ ఆ ట్యాంకులోకి దిగారు. తీరా దిగిన తరువాత లోపల ఊపిరి ఆడక కేకలు పెట్టారు. ఆ కేకలు విని అప్రమత్తమైన స్థానికులు.. వెంటనే అక్కడకు చేరుకుని వారిని బయటకు తీశారు. అయితే అప్పటికే ఆ ఇద్దరూ మృతి చెందారు.
ఆ యువకులిద్దరూ బంక్ పక్కనే ఉన్న మద్యం షాపు వద్దకు వచ్చి మద్యం తాగి, డీజిల్ కోసం ట్యాంకులోకి దిగారని, ఎండ తీవ్రతకు డీజిల్ వేడెక్కి గ్యాస్ ఏర్పడి, ఊపిరాడక చనిపోయారని స్థానికులు అంటున్నారు
మృతదేహాలపై గాయాలు
కాగా, మహేష్, శివకుమార్ శరీరాలపై గాయాలు ఉండటంతో ఇది ప్రమాదవశాత్తూ జరిగిన ఘటన కాదని, ఎవరో ఉద్దేశపూర్వకంగానే వీరిని హత్య చేసి డీజిల్ ట్యాంకులో పడవేశారని ఆరోపిస్తూ మృతుని బంధువులు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న కాకినాడ రూరల్ సీఐ కె.శ్రీనివాసరావు, గొల్లపాలెం ఎస్సై ఎస్.తులసీరామ్, తహసీల్దార్ బి.సాయి సత్యనారాయణ, ఆర్‌ఐ వై.వేగేశ్వరరావు తదితరులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులతో చర్చించారు. ఈ ఘటనపై మృతుల కుటుంబ సభ్యుల ఆందోళనలు, స్థానికుల వాంగ్మూలాల ఆధారంగా విచారణ చేపట్టామని సీఐ శ్రీనివాసరావు, ఎస్సై తులసీరామ్ తెలిపారు. జిల్లా కేంద్రం నుంచి మాలమహానాడు, మాదిగ ఐక్యవేదిక సభ్యులు సంఘటన స్థలం వద్దకు చేరుకుని, టెంట్లు వేసి ఆందోళన కొనసాగిస్తున్నారు.
అందివచ్చిన కొడుకుల మృతితో..
ఆర్యావటం గ్రామానికి చెందిన తాతపూడి అప్పారావుకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వీరిలో మహేష్ చిన్నవాడు. అలాగే శీల గ్రామానికి చెందిన నేరేడుమిల్లి పెద్ద సత్యనారాయణకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉండగా వీరిలో శివకుమార్ చివరి సంతానం. ఇద్దరు పాతికేళ్లు పెంచుకున్న కొడుకులు చేతికి అంది వచ్చారని సంతోషిస్తున్న సమయంలో.. ఈ దుర్ఘటనలో మృతి చెందారంటూ వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
బయోడీజిల్ ట్యాంకులోకి దిగిన
లారీ డ్రైవర్, క్లీనర్
ఊపిరి ఆడక ప్రాణభయంతో కేకలు పెడితే బయటకు తీసిన స్థానికులు అయినా దక్కని ప్రాణాలు కొట్టి చంపారని బంధువులు ఆందోళన చేస్తున్నారు