
ఎర్రటి ఎండలో అమిత్ షా సభ: 11 మంది మృతి.. 50 మంది ఆసుపత్రిపాలు
మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన రెబెల్- బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో విషాదం చోటు చేసుకుంది.
గుండెపోటుతో ఒకేసారి 11 మంది మృత్యువాత పడ్డారు. మరో 50 మంది ఆసుపత్రి పాలయ్యారు.
ఈ 50 మంది కూడా గుండె సంబంధిత ఇబ్బందులతో చికిత్స పొందుతోన్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు.
మహారాష్ట్ర భూషణ్ అవార్డును అందజేయడానికి ప్రభుతం ఏర్పాటు చేసిన కార్యక్రమం, సభ ఇది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా- దీనికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
నవీ ముంబైలోని ఖార్‌ఘర్‌లో ఈ సభ ఏర్పాటైంది. వేలాదిమంది హాజరయ్యారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పలువురు మంత్రులు ఇందులో పాల్గొన్నారు.
అప్పాసాహెబ్ ధర్మాధికారి, మరికొందరికి అమిత్ షా మహారాష్ట్ర భూషణ్ అవార్డులను అందజేశారు.
ఆదివారం ఉదయం 11:00 గంటలకు ప్రారంభమైన ఈ అవార్డుల ప్రదానోత్సవం మధ్యాహ్నం వరకూ కొనసాగింది.
ఓపెన్ గ్రౌండ్‌లో ఇది ఏర్పాటైంది. ఎలాంటి షెడ్లు గానీ, షామియానా గానీ ఏర్పాటు చేయలేదు మహారాష్ట్ర ప్రభుత్వం. ఫలితంగా ఈ కార్యక్రమానికి వచ్చిన వేలాది మంది ఎర్రటి ఎండలో కొన్ని గంటల పాటు కూర్చోవాల్సి వచ్చింది.
ఈ సభకు ఆతిథ్యాన్ని ఇచ్చిన ఖార్‌ఘర్‌లో 39 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది.
ఎలాంటి షెడ్లు గానీ, షామియానా గానీ ఏర్పాటు చేయకపోవడం, కొన్ని గంటల పాటు ఎండలో కూర్చోవడం వల్లే వారు గుండెపోటుకు గురై ఉంటారనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.
అవార్డుల ప్రదానోత్సవం ముగిసేసరికి చాలామంది వడదెబ్బకూ గురయ్యారు. వారిని హుటాహుటిన ఎంజీఎం కామోతె ఆసుపత్రికి తరలించారు
11 మంది గుండెపోటుతో మరణించినట్లు డాక్టర్లు వెల్లడించారు. మరో 50 మంది గుండె సంబంధిత సమస్యలతో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు.
ఈ ఘటన పట్ల మహారాష్ట్ర ప్రభుత్వం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు అయిదు లక్షల రూపాయల పరిహారాన్నిచెల్లిస్తామని ఏక్‌నాథ్ షిండే ప్రకటించారు.
ఇది దురదృష్టకర ఘటనగా దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, ఆదిత్య థాకరే, ప్రతిపక్ష నేత అజిత్ పవార్.. ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు.
ఎండ తీవ్రంగా ఉన్న విషయం తెలిసినప్పటికీ.. ప్రభుత్వం కనీస జాగ్రత్తలను తీసుకోలేకపోయిందని ఉద్ధవ్ థాకరే అన్నారు.
కాస్త నీడ కల్పించాలనే ఆలోచన కూడా ప్రభుత్వానికి రాకపోవడం బాధాకరమని చెప్పారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.
శివసేన రెబెల్-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి ప్రజలు అంటే ఎంత చులకనభావం అనేది ఈ ఘటనతో మరోసారి స్పష్టమైందని అన్నారు.