గురుకుల బాలికల పాఠశాల విద్యార్థిని మృతి

Spread the love

తీవ్ర అస్వస్థతకు గురైన సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థిని మృతి చెందింది. ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేక పోయింది. విషయం తెలిసి ఆస్పత్రికొచ్చిన తల్లి దండ్రులు కుప్పకూలారు. తల్లి అస్వస్థతకు గురైంది. ఈ ఘటన శనివారం కుమురంభీం-ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌(టి) మండల కేంద్రంలో జరిగింది. కళాశాల సిబ్బంది, వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం..


మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రావులపల్లి గ్రామానికి చెందిన సమ్మయ్య-లలిత దంపతుల పెద్ద కూతురు సోదరి శ్రీవాణి(14) సిర్పూరు (టి) మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. గురువారం పాఠశాలలోనే ఆమెకు నడుం నొప్పి, కాళ్లు గుంజుతున్నాయని ఇబ్బందిపడటంతో హెల్త్‌ సూపర్‌వైజర్‌ అంజలి చికిత్స చేశారు.

శుక్రవారం ఉదయం మరోసారి నొప్పి రావడంతో ఆమెను సిర్పూరు (టి) మండల కేంద్రంలోని సామాజిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. బయటనే రక్తపరీక్షలు చేయగా రక్తం తక్కువగా ఉన్నట్టు రిపోర్ట్‌ వచ్చింది. ఆస్పత్రిలో వైద్యులు జోగీందర్‌ రెండు ఇంజక్షన్‌లు చేసి తిరిగి పాఠశాలకు పంపించారు. ప్రస్తుతం తొమ్మిదో తరగతి పరీక్షలు జరుగుతుండటం, శనివారం చివరి పరీక్ష కావడంతో ఉదయమే శ్రీవాణి అల్పాహారం చేసి పరీక్ష రాసింది. పరీక్ష రాసే క్రమంలోనే తనకు కండ్లు తిరుగుతున్నాయని చెప్పడంతో వెంటనే హెల్త్‌ సూపర్‌వైజర్‌ ఆస్పత్రికి తరలించారు.

ఆక్సీజన్‌ పల్స్‌ తగ్గటం.. ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణిస్తుండటంతో అక్కడి నుంచి మంచిర్యాల ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. అంబులెన్స్‌లో తరలిస్తున్న క్రమంలో బాలిక మార్గమధ్యలోనే తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే కాగజ్‌నగర్‌లోని ప్రయివేట్‌ ఆస్పత్రిలో పరీక్షలు చేయించారు. అయితే, పరిస్థితి విషమంగా ఉండ టంతో వైద్యులు ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. కాగజ్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రికి తీసుకురాగా బాలిక మృతిచెందినట్టు నిర్దారించారు. ఈ క్రమంలో ఆస్పత్రి వద్ద భారీ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగజ్‌నగర్‌ డీఎస్‌పీ కరుణాకర్‌ ఆధ్వర్యంలో టౌన్‌ సీఐ, రూరల్‌ సీఐ, కౌటాల సీఐలు బుద్దె స్వామి, నాగరాజు, సాదిక్‌పాషా, డివిజన్‌లోని పలువురు ఎస్‌ఐలు బందోబస్తు చేపట్టారు.


తల్లిదండ్రుల రోధన సాయంత్రం కోటపల్లి మండలం నుంచి వచ్చిన బాలిక తల్లితండ్రులు సమ్మయ్య, లలిత ఆస్పత్రి ముందే కూలబడి బోరున రోధించారు. తమకు గురుకులం నుంచి ఎలాంటి సమాచారమూ ఇవ్వలేదని, ఈ రోజే తమ కూతురు ఆరోగ్యం బాగోలేదని చెప్పారని తండ్రి సమ్మయ్య తెలిపాడు. కూతురిని మంచిర్యాలకు తీసుకొస్తున్నామని, అక్కడికి రావాలని ముందు చెప్పారని, తర్వాత కాగజ్‌నగర్‌కు రావాలని చెప్పారన్నారు.

తన మూడేండ్ల మరో కూతురిని ఎత్తుకొని తల్లి లలిత ఆస్పత్రి ఆవరణలో గుండెలవిసేలా ఏడ్చింది. అస్వస్థతకు గురైన లలితను మహిళా పోలీసులు ఆస్పత్రి లోపలికి తీసుకువెళ్లి చికిత్స అందించారు. ఆమెకు కూతురి మృతదేహాన్ని చూపించకుండా.. తండ్రి సమ్మయ్యకు మాత్రమే కుమార్తె మృతదేహాన్ని చూపించారు.


పాలు పార్టీల ధర్నా మృతి విషయం తెలుసుకున్న పలు రాజకీయ పార్టీల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ.. స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బాధ్యత వహించాలని డిమాండ్‌ చేస్తూ ఆస్పత్రి ముందు ధర్నాకు దిగారు. సీపీఐ(ఎం) నాయకులు ముంజం ఆనంద్‌కుమార్‌, బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్‌ శ్రీనివాస్‌, నియోజకవర్గ నాయకులు పాల్వాయి హరీష్‌బాబు, బీఎస్‌పీ నియోజకవర్గ ఇన్‌చార్జి అర్షద్‌హుస్సేన్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు రావి శ్రీనివాస్‌, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఆస్పత్రికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం ధర్నా చేశారు.

4,911 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?