బడి ఉంటే బతికేటోళ్లు కదరా.. దేవుడా..!!

Spread the love

ఒక్కగానొక్క కొడుకువు కదరా బిడ్డా.. నీ సదువు కోసం ఊరుగాని ఊరు వచ్చినం కదరా.. ఇప్పుడు నువ్వు మమల్ని ఇడ్సిపెట్టిపోతివారా’ అంటూ ఓ తల్లి..

‘నీ సదువును సూసి మురిసిపోతిమి కదరా.. మంచిగా సదువుకొని మమ్మల్ని సాత్తవనుకుంటిమి కదా బిడ్డా.. పాపపు చెరువు నీపాణం తీసే కదరా కొడుకా’ అంటూ.. మరో తల్లి..

క్రికెట్‌ క్రికెట్‌ అంటూ బ్యాటు పట్టుకుని తిరుగుతుంటివి.. కొడుకు ఎక్కన్నో ఆడుకుంటుండనుకున్నం.. ఇట్ల నిన్ను జీవం లేకుండా చూస్తమనుకోలే తండ్రీ.. బడి ఉంటే బతికేటోళ్లు కదరా.. దేవుడా..!!

… అంటూ ఆ పిల్లల తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించిన తీరు ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టించింది. పనిచేస్తే కానీ పూటగడవని కుటుంబాలు. పొద్దుగాలనే కూలిపనికి పోయేటోళ్లు. పిల్లలను చూసుకుంటూ బతుకుతున్న తల్లిదండ్రులు. అన్నం, కూర వండి.. ‘తినుండ్రి బిడ్డా.. సాయంత్రం వస్తాం’ అన్ని చెప్పి వెళ్లిన ఆ తల్లిదండ్రులు పిల్లల మరణవార్త విని ఒక్కసారిగా ఘొల్లుమన్నారు. ఆ పాపపు చెరువు మిమ్మల్ని మింగిందా కొడుకా అంటూ రోదించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ న్యూపోరట్‌పల్లికి చెందిన ముగ్గురు విద్యార్థులు శుక్రవారం మేడిపల్లి శివారులోని పెద్దచెరువులో ఈతకు వెళ్లి మరణించడం ఆ తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చింది. శుక్రవారం చోటు చేసుకున్న ఈ ఘటన రామగుండం ప్రాంతాన్ని కన్నీరు పెట్టించింది.

సెలవు దినమని..
రామగుండం ఎన్టీపీసీ పరిధిలోని న్యూపోరట్‌పల్లికి గ్రామానికి చెందిన సోయం ఉమామహేశ్వర్‌(12), మామిడి విక్రం(13), మేకల సాయిచరణ్‌(13), ఇల్లుటం శశి స్నేహితులు. వీరి ఇండ్లు పక్కపక్కనే ఉంటాయి. శుక్రవారం అంబేడ్కర్‌ జయంతి సెలవు రోజు కావడంతో ఇంటివద్దే ఉన్నారు. వారి తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లారు. నలుగురు కలిసి క్రికెట్‌ ఆడేందుకు బయటకు వెళ్లారు. గంటసేపు క్రికెట్‌ ఆడిన తరువాత గ్రామానికి దాదాపు 200 మీటర్ల దూరంలో ఉన్న మేడిపల్లి చెరువు వద్దకు ఈతకని సైకిళ్లపై వెళ్లారు. ఉమామహేశ్వర్‌, మామిడి విక్రం, మేకల సాయిచరణ్‌ చెరువుకట్టపై బట్టలు ఉంచి చెరువులోకి ఈతకొట్టేందుకు దిగారు. సమీపంలో ఉన్న తన తాత దగ్గరికి శశి వెళ్లాడు. పది నిమిషాల తరువాత వచ్చేసరికి ముగ్గురు స్నేహితులు నీటిలో మునిగిపోతున్నట్లు కనిపించారు. దీంతో శశి ఆందోళనకు గురయ్యాడు.
చుట్టు పక్కలవారు గమనించి..
చెరువుకు సమీపంలో ఉన్న మామిడి రమేశ్‌, మేకల రాములు పిల్లలు మునిగిపోతున్నట్లు గమనించారు. వారికీ ఈత రాకపోవడంతో గ్రామానికి చెందిన ఆరెందుల చంద్రయ్య, కారెంగుల మల్లేశ్‌, కాళ్ల శ్రీనివాస్‌కు సమాచారం ఇచ్చారు. వారు పది నిమిషాల వ్యవధిలో చెరువులోకి దిగారు. ముగ్గు రు పిల్లలు నీట మునిగి కనిపించారు. వెంటనే బయటకు తీసుకొచ్చారు. నీళ్లు మింగారని సీపీఆర్‌చేసి బతికించే ప్రయత్నం చేశారు. ముత్తునూరి సంపత్‌కు చెందిన ఆటోలో గోదా వరిఖని ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు పిల్లలు ముగ్గురు చనిపోయారని చెప్పారు. శశి తనతాత దగ్గరకు వెళ్లడంతో అతని ప్రాణాలు దక్కాయి.

మిన్నంటిన రోదనలు
ముగ్గురు పిల్లలు చెరువులో మునిగారన్న సమాచారంతో వారి తల్లిదండ్రులు ఏరియా ఆస్పత్రికి చేరుకున్నారు. చిన్నారుల మృతదేహాలను చూసి గుండెలవిసేలా రోదించారు. వారి మిత్రులు, బంధువుల రాకతో ఆస్పత్రి దుఃఖసాగరంలో మునిగిపోయింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించగా.. విక్రం మృతదేహాన్ని స్వగ్రామమైన కాల్వశ్రీరాంపూర్‌ మండలం మడిపెల్లి గ్రామానికి తీసుకెళ్లారు. సాయిచరణ్‌ అంత్యక్రియలు పూర్తికాగా.. ఉమా మహేశ్వర్‌వి నేడు చేయనున్నారు. గోదా వరిఖని ఏసీపీ గిరిప్రసాద్‌, ఎన్టీసీపీ సీఐ చంద్రశేఖర్‌, డిప్యూ టీ మేయర్‌ అభిషేక్‌రావు మృతుల కుటుంబాలను ఓదార్చా రు. ఎన్టీపీసీ ఎస్సై జీవన్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చెరువులో పేరుకుపోయిన అండు కారణంగానే చిన్నారులు చనిపోయి ఉంటారని స్థానికులు భావిస్తుండగా.. అప్పటివరకు కలిసిమెలిసి తిరిగిన పిల్లలు కాటికి చేరడంతో న్యూపోరట్‌పల్లి గ్రామం నిశ్శబ్దంగా మారింది.

పుత్రశోకాన్ని మిగిల్చి..

► స్థానికంగా బట్టలు ఇసీ్త్ర పనిచేసుకుని జీవనోపాధి పొందే మామిడి రమేశ్‌- లక్ష్మి దంపతులకు కూతురు- కొడుకు విక్రం సంతానం. వీరిది స్వగ్రామం కాల్వశ్రీరాంపూర్‌ మండలం మడిపెల్లి. పిల్లల చదువుకోసం న్యూపోరట్‌పల్లిలో కొన్నేళ్లుగా అద్దెకు ఉంటున్నారు. విక్రం స్థానిక ప్రైవేటు పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. ఇటీవలే బర్త్‌డే జరుపు కున్న విక్రం ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డాడు.

► న్యూపోరట్‌పల్లి గ్రామానికి చెందిన సోయం జనార్దన్‌- క్రిష్ణవేణి దంపతులకు ఇద్దరు కొడుకులు. చిన్నవాడు ఉమామహేశ్వర్‌. జనార్దన్‌ ఆటో నడుపుతుంటాడు. క్రిష్ణవేణి కూలిపని చేస్తుంటుంది. ఉమా మహేశ్వర్‌ స్థానిక దుర్గయ్యపల్లె ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. ఉమామహేశ్వర్‌ చదువులో ముందుంటాడు. ఉన్నతంగా చదివిద్దామనుకుంటే అందకుండా పోయావా అంటూ తల్లి దండ్రులు రోదించిన తీరు కలిచివేసింది.

► ఇదే గ్రామానికి చెందిన మేకల రాములు- సునీత దంపతుల పెద్ద కుమారుడు సాయిచరణ్‌(13). మిల్లర్‌పై కూలీ పనిచేసుకుంటేనే పూటగడిచే స్థితిలో రాములు కుటుంబం ఉంది. అతని భార్య కూడా కూలిపని చేస్తుంటుంది. ఎన్టీపీసీ జ్యోతినగర్‌ దుర్గయ్యపల్లె ప్రభు త్వ పాఠశాలలో సాయిచరణ్‌ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. క్రికెట్‌ ఆటలో మంచి ప్రావీణ్య ఉన్న వ్యక్తి. క్రికెట్‌ ఆడేందుకు వెళ్లి చెరువులో దిగి ప్రాణాలు పోగొట్టుకున్నాడు.

5,090 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?