
అధికారుల్లో అలసత్వాన్ని సహించేది లేదు.
నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై క్రమశిక్షణా చర్యలు తప్పవు.
15 రోజుల్లోగా టెండర్లన్నీ పూర్తి కావాలి.
నాణ్యతలో రాజీ లేకుండా నిర్మాణ పనులు పూర్తి చేయాలి.
గిరిజనుల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ డి ఎస్ ఎస్ భవన్ లో ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ అధికారులతో మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష.
చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారని రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని డిఎస్ఎస్ భవన్ లో గిరిజన ఇంజనీరింగ్ అధికారులతో మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కేటాయించిన నిధులతో యుద్ధ ప్రాతిపదికన పనులను పూర్తిచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
గిరిజన ప్రాంతాల్లో గ్రామపంచాయతీ భవనాలు, బీటీ రోడ్లు, గురుకులాల నిర్మాణాల పనుల పై అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. ఎక్కడైనా భూమి సమస్యలుంటే కలెక్టర్లు, ఐటిడీఏపీఓ దృష్టికి తీసుకువచ్చి సమన్వయంతో పనులు చేసుకోవాలని సూచించారు.. ఈ మూడు నెలలు వర్కింగ్ సీజన్ నేపథ్యంలో త్వరగా ఎస్టిమేట్స్ తెప్పించుకొని 15 రోజుల్లో టెండర్లను పిలిచే అగ్రిమెంట్స్ చేసుకోవాలన్నారు. క్వాలిటి విషయంలో ఎక్కడ రాజీలేకుండా పనులను పూర్తిచేయాలని సూచించారు.
కాంట్రాక్టర్లతో మాట్లాడి, ఎట్టి పరిస్థితుల్లో పనులు పూర్తి కావాలన్నారు.వారానికి ఒకసారి సమీక్ష నిర్వహించాలని పనుల పురోగతి, అధికారుల పనితీరుపై ఎప్పటికప్పుడుపర్యవేక్షణ కొనసాగాలన్నారు. సెక్రటరీ, ఐటీడీఏ పీవో లు ఫీల్డ్ విజిట్ చేయాలని మంత్రి ఆదేశించారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏడు యూనివర్సిటీల్లో ఒక్కో యూనివర్సిటీలో 500 మంది విద్యార్థులకు వసతి కల్పించే విధంగా గిరిజన బాల బాలికలకు వేర్వేరుగా హాస్టల్ నిర్మాణం కోసం 140 కోట్లు కేటాయించడం జరిగిందని ఈ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.
గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మహబూబాబాద్ తో పాటు కామారెడ్డి జిల్లాలో 2 గురుకులాలకు మంజూరు ఇచ్చారని, గురుకుల భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
సీఎం కేసీఆర్ గిరిజన తండాలను గ్రామపంచాయితీల చేయడమే కాకుండా వాటి అన్నీంటికి పరిపాలన భవనాల నిర్మాణాలకు ఒక్కో భవనానికి 20 లక్షల రూపాయాల చొప్పున 600 కోట్ల నిధులతో మంజూరి ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ భవన నిర్మాణ పనుల్లో అధికారులు అలసత్వం ప్రదర్శించకుండ నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ జీపీల నిర్మాణాన్ని పూర్తి చేయాలని పేర్కొన్నారు.
రాష్ట్రంలో రోడ్ కనెక్టివిటీ లేని ప్రాంతం ఉండకూడదనే ప్రభుత్వ నిర్ణయం మేరకు గిరిజన, మారుమూల ప్రాంతాల్లో రొడ్డు కనెక్టివిటి లేని 78 నియోజక వర్గాల్లోని 2090 గిరిజన ఆవాసాలకు 1 వేయ్యి 5 వందల కోట్ల నిధులతో బిటి రోడ్లు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు ఇవ్వడం జరిగిందని,రోడ్ల పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు.
అధికారుల్లో అలసత్వాన్ని సహించేది లేదని,నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై క్రమశిక్షణా చర్యలు తప్పవు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ మనందరి మీద నమ్మకంతో, గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేసే అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని,మన విధులను చక్కగా నిర్వర్తిద్దాం. నిధులను అంతే సక్రమంగా ఖర్చు చేసి, సీఎం ఆలోచనల మేరకు ప్రజల ముంగిట్లోకి అభివృద్ధిని తీసుకెళ్ళి చూపిద్దాం అని మంత్రి సత్యవతి రాథోడ్ అధికారుల్లో స్ఫూర్తిని నింపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, స్పెషల్ సెక్రటరీ శ్రీధర్, అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి, జాయింట్ డైరెక్టర్ కళ్యాణ్ రెడ్డి, మరియు ఐటిడిఎపిఓలు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.