
ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం.. బాలిక మృతి
భువనగిరి: చెత్త సేకరించే ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం ఓ బాలిక ప్రాణాన్ని బలిగొన్నది. ఈ ఘటన భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో గురువారం చోటు చేసుకుంది.
వివరాలు.. అస్సాం రాష్ట్రానికి చెందిన అశ్ర అలీ, కాన్సోన్ దంపతులు తమ ఇద్దరు కుమార్తెలు అఫ్సానా(9), మారియాతో కలిసి నెల క్రితం భువనగిరికి వలస వచ్చారు.
ప్రస్తుతం మున్సిపాలిటీకి చెందిన డంపింగ్ యార్డులో నివాసముంటూ ప్లాస్టిక్ కవర్లను సేకరించి విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు.
గురువారం ఇద్దరు కుమార్తెలు డంపింగ్ యార్డులో ఉన్న శిలాఫలకం వద్ద ఆడుకుంటుండగా, చెత్త సేకరించిన ఆటో డంపింగ్ యార్డులో చెత్తను వేసేందుకు వచ్చింది.
చెత్తను డంప్ చేసిన తర్వాత ఆటో డ్రైవర్ అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనాన్ని వెనుకకు తీసుకునే క్రమంలో శిలాఫలకాన్ని ఢీకొట్టింది.
దీంతో శిలాఫలకం పక్కనే ఆడుకుంటున్న ఇద్దరు బాలికలపై శిలాఫలకం పడగా, అఫ్సానా అక్కడికక్కడే మృతిచెందింది.
అక్కడే ఉన్న సిబ్బంది 108 వాహనంలో తీవ్రగాయాలపాలైన మారియాను జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
మృతిచెందిన బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రి మార్చురీకి తరలించారు. తండ్రి అశ్ర అలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కృష్ణయ్య తెలిపారు.