
పిచ్చోని చేతిలో ఒక పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం..: బీజేపీ లీక్స్ అంటూ కేటీఆర్ ట్వీట్
తెలంగాణ పదో తరగతి పరీక్షల హిందీ పేపర్ లీకేజ్ కేసుకు సంబంధించి పోలీసులు టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను అరెస్ట్ చేశారు. ఆయనపై కుట్ర కేసు నమోదు చేశారు.
పరిణామాలపై తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. పిచ్చోని చేతిలో రాయి ఉంటే.. వచ్చి పోయేటోళ్ళకే ప్రమాదమని.. కానీ అదే పిచ్చోని చేతిలో ఒక పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం.. అని అన్నారు. బీజేపి నాయకులు వారి స్వార్థ రాజకీయాల కోసం ప్రశ్నపత్రాలు లీకు చేసి అమాయకులైన విద్యార్ధుల, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. #BJPleaks అనే హ్యాష్ ట్యాగ్ కూడా జతచేశారు.
ఇదిలా ఉంటే.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ను బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కరీంనగర్‌లోని బండి సంజయ్ నివాసం నుంచి ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకుంది. తనను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులను.. తనను తీసుకెళ్లడానికి గల కారణమేమిటో చెప్పాలని ప్రశ్నించారు. తన మీద ఏం కేసు ఉందని?, వారెంట్ లేకుండా ఎలా తీసుకెళ్తారని ప్రశ్నించారు. అయితే పోలీసులు కారణం చెప్పకుండానే బండి సంజయ్‌ను ఆయన ఇంటి నుంచి బలవంతంగా బయటకు తీసుకొచ్చారు. ఈ సమయంలో బీజేపీ శ్రేణులు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకుంది. అయితే ఈ ఉద్రిక్తతల మధ్యే బండి సంజయ్‌ను పోలీసు వాహనంలోకి ఎక్కించిన పోలీసులు.. బొమ్మలరామారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అయితే బండి సంజయ్ అరెస్ట్‌పై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే.. బండి సంజయ్‌ను బొమ్మలరామారం పోలీసు స్టేషన్ నుంచి తరలించారు. బండి సంజయ్‌ను తరలించే మార్గంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయనను వరంగల్ వైపు తరలిస్తున్నారు. మార్గమధ్యలో బండి సంజయ్‌ను తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకునేందుకు బీజేపీ శ్రేణులు యత్నించాయి. అయితే పోలీసులు వారిని చెదరగొట్టారు. ఇక, పాలకుర్తిలోని ఆస్పత్రిలో బండి సంజయ్‌కు తరలించి వైద్య పరీక్షలు పూర్తి చేశారు. ఆయనను మరికాసేపట్లో వరంగల్ తరలించి.. కోర్టులో హాజరుపరచనున్నారు.