
బలగం సినిమాని ఆస్కార్ కి పంపించాలనుకుంటున్నాం.. రాజకీయాల్లోకి రమ్మంటున్నారు
బలగం సినిమాను ఆస్కార్‌కు కచ్చితంగా పంపించేలా చర్యలు తీసుకుంటాం. ఏదో బడ్జెట్ పెట్టాలనే వార్తలు వచ్చాయి. నేను కూడా కార్తికేయతో దాని గురించి మాట్లాడాను.
Dil Raju : కమెడియన్ వేణు(Venu) దర్శకుడిగా మారి ప్రియదర్శి(Priyadarshi), కావ్య కళ్యాణ్ రామ్(Kavya Kalyan Ram) ముఖ్యపాత్రల్లో మానవ సంబంధాలు, కుటుంబ విలువలు కథాంశంతో తెరకెక్కించిన సినిమా బలగం(Balagam).
దిల్ రాజు(Dil Raju) కూతురు హన్షిత రెడ్డి(Hanshitha Reddy) ఈ సినిమాని నిర్మించింది. చిన్న సినిమాగా రిలీజయి పెద్ద విజయం సాధించింది. కలెక్షన్స్ తో పాటు పేరు కూడా సంపాదించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాపై ప్రేక్షకులు, ప్రముఖుల నుంచి అభినందనలు వస్తున్నాయి.
తాజాగా బలగం సినిమాని గ్రామాల్లో తెరలు కట్టి వేయడంపై వివాదం రావడం, బలగం సినిమాలకు పలు అభినందనలు, ఇంటర్నేషనల్ అవార్డులు రావడం జరగడంతో ఈ నేపథ్యంలో దిల్ రాజు మరోసారి బలగం సినిమాపై ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ ప్రెస్ మీట్ లో దిల్ రాజు బలగం సినిమాకు సంబంధించి అనేక అంశాలపై మాట్లాడారు.
బలగం సినిమా ప్రెస్ మీట్ లో దిల్ రాజు మాట్లాడుతూ.. హర్షిత్, హన్షితలు బలగం సినిమాను రిలీజ్ చేయటానికంటే ముందే పలు ఇంటర్నేషనల్ అవార్డులకు పంపారు.
ఇప్పటికే ఈ సినిమాకు 7 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. అందులో రెండు అవార్డులు డైరెక్టర్ వేణుకి, ఒకటి హీరోకి, ఒకటి హీరోయిన్‌కి, మిగిలినవి సినిమాకు వచ్చాయి. 20 ఏళ్లలో 50 సినిమాలు చేశాను.
ఇన్నేళ్లలో ఏ సినిమాకు ఇంటర్నేషనల్ అవార్డ్ రాలేదు. ఫస్ట్ టైమ్ దీనికి వస్తున్నాయి. చాలా ఆనందంగా ఉంది అని అన్నాడు.
అలాగే.. బలగం సినిమాను ఆస్కార్‌కు కచ్చితంగా పంపించేలా చర్యలు తీసుకుంటాం. ఏదో బడ్జెట్ పెట్టాలనే వార్తలు వచ్చాయి. నేను కూడా కార్తికేయతో దాని గురించి మాట్లాడాను.
నిజానికి యుఎస్‌లో స్ట్రీమింగ్ చేయటానికి కొంత బడ్జెట్ పెట్టాలి. అదే వాళ్లు పెట్టారు. ఆస్కార్ గెలుచుకున్న ఎలిఫెంట్ సినిమా విషయానికి వస్తే వాళ్లేం ఎక్కువగా బడ్జెట్ పెట్టలేదు. అందుకే మేము కూడా బలగం సినిమాని ఆస్కార్ వరకు తీసుకెళ్లాలి అనుకుంటున్నాం అని అన్నారు.
రాజకీయాల గురించి దిల్ రాజు మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీతో పాటు అటు రాజకీయ నాయకులు సైతం మా బలగం సినిమాను అభినందిస్తున్నారు. పలువురు రాజకీయ నాయకులు, మా ఊరి నాయకులు నన్ను కూడా రాజకీయాల్లోకి రమ్మంటున్నారు.
సినీ పరిశ్రమలోనే ఎవరన్నా ఏమన్నా అంటే నేను తట్టుకోలేను. ఇక రాజకీయాల్లో విమర్శలు చాలా ఎక్కువ. వాటిని నేను తట్టుకోలేను.
ప్రస్తుతానికైతే రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన లేదు అని తెలిపారు. దీంతో దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి బలగం సినిమా ఆస్కార్ వరకు వెళ్తుందేమో చూడాలి.