
సెవెన్త్ క్లాస్ అమ్మాయితో బస్సులో అసభ్య ప్రవర్తన..అరాచకుడిగా మారిన ఆర్టీసీ డ్రైవర్‌కి దేహశుద్ధి
మహిళా రక్షణకు ఎన్నో చట్టాలు అమలులో ఉన్నాయి. దిశ, చిన్నారుల కొరకు పోక్సో చట్టం, నిర్భయ యాక్ట్ వంటివి రాష్ట్రంలోనూ…దేశంలోను అమలు అవుతూనే ఉన్నాయి.
కానీ కామాంధుల కళ్లు మాత్రం కామంతో మూసుకుపోతున్నాయి.
చదువుకుంటున్న స్కూల్ పిల్లల దగ్గర నుంచి ఉద్యోగాలు , ఉపాధి పనులు చేసుకునే మహిళలు, యువతుల వరకు రోజూ ఏదో ఒక చోట అఘాయిత్యానికి పాల్పడుతూనే ఉన్నారు మృగాళ్లు. కూతురు వయసు., మనవరాలితో సమానమైన మైనర్ బాలికలను సైతం వదలడం లేదు.
తాజాగా చిత్తూరు జిల్లా(Chittoor District)లో ఓ ఆర్టీసీ డ్రైవర్(RTC Driver) కూతురు వయసున్న మైనర్ బాలిక(Minor Girl) వెంట పడ్డాడు. ప్రేమ అంటూ లొంగదీసుకొని మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ ఆర్టీసీ డ్రైవర్ అరాచకం పరాకాష్టకు చేరడంతో ప్రయాణికుల కంట్లో పడ్డాడు.
అంతే చితకబాది పోలీసులకు అప్పగించారు.
ఆర్టీసీ డ్రైవర్ అరాచకపర్వం..
పసివాళ్లు, మైనర్ బాలికలనే విచక్షణ కూడా కోల్పోతున్నారు కామాంధులు.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపోలో డ్రైవర్ గా శ్రీనివాసులు అనే 46ఏళ్ల కామాంధుడు బస్సులో ప్రయాణించే తన కూతురు వయసున్న ఓ మైనర్ బాలికను ట్రాప్ చేశాడు.
ప్రేమ పేరుతో ఆ బాలికకు మాయ మాటలు చెప్పి తన కోరిక తీర్చుకోవాలని పథకం వేసుకున్నాడు. ప్రభుత్వం పాఠశాల స్టూడెంట్స్‌కి ఉచిత ఆర్టీసీలో రవాణా సౌకర్యం కల్పిస్తోంది. దీంతో శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్న శ్రీనివాసులు బుచ్చినాయుడు ఖండ్రిగ మండలంలో తంగేళ్ళపాళ్యం తమిళ మీడియం హైస్కూల్ లోని విద్యార్ధుల బస్సును నడుపుతున్నాడు.
అదే అదునుగా చేసుకొని తన కామ వాంఛకు చిన్నారులను వాడుకోవాలని చూసాడు. అభం శుభం తెలియని విద్యార్ధినులను పట్ల వ్యామోహం పెంచుకున్నాడు. అనుకున్న విధంగా విద్యార్థినులను తనవైపు తిప్పుకొని ప్రయత్నం చేస్తూ వచ్చాడు.
ముందస్తుగా శ్రీనివాసులు ప్లాన్ ప్రకారం బస్సులో ప్రయాణించే విద్యార్ధినులకు చాక్లెట్స్, బిస్కెట్స్, ఐస్‌క్రీంలు ఆశ చూపేవాడు.
ప్రతిరోజు విద్యార్ధినులకు మాయమాటలు చెబుతూ వారికి దగ్గర అయ్యాడు. ఇలా విద్యార్ధినులను మచ్చిక చేసుకుని వారితో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వచ్చాడు. అంతటితో ఆగకుండా వాళ్లతో చేసే వెకిలి చేష్టలను తన సెల్‌ఫోన్‌లో ఫోటోలు తీసుకొని వాటి చూస్తూ పైశాచిక ఆనందం పొందేవాడు.
శుక్రవారం సాయంత్రం తంగేళ్ళపాళ్యం తమిళ మీడియం హైస్కూల్‌లో ఏడోవ తరగతి చదువుతున్న అరిగళ్ళ కండ్రిగకు చెందిన మైనర్ బాలికను లొంగదీసుకున్నాడు కామాంధుడు. బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించాడు డ్రైవర్ శ్రీనివాసులు.
డ్రైవర్‌కి దేహశుద్ధి..
బస్సులో బాలిక పట్ల డ్రైవర్ వేస్తున్న అకృత్యాలను ప్రయాణికులు గమనించి శ్రీనివాసులకు దేహశుద్ధి చేసి శ్రీకాళహస్తి రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ కి తరలించారు. రెండవ పట్టణ పోలీసు స్టేషన్ వారు తమ పరిధికి రాదంటూ సత్యవేడు నియోజకవర్గంలోని బుచ్చినాయుడు కండ్రిగ మండలం పరిధిలోని పోలీస్ స్టేషన్ పరిధికి వస్తుందని తెలియజేయడంతో కామాంధుడు శ్రీనివాసులని బుచ్చినాయుడు కండ్రిగ పోలీసులకు అప్పగించారు.
బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకూ కేసు నమోదు చేసిన బుచ్చినాయుడు కండ్రిగ పోలీసులు నిందుతుడిపై ఫోక్సో చట్టం క్రింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.