
ప్రేమ విషాదాంతం.. ఎస్సై విడదీశారంటూ ఆందోళన
పెద్దల సమక్షంలో పెళ్లి చేయిస్తామని చెప్పి అమ్మాయి కుటుంబ సభ్యులు మోసం చేశారనే మనస్తాపంతో ఓ యువకుడు పురుగుల మందు తాగి, చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన జనగామలో చోటు చేసుకుంది.
ఏఎస్సై సదాశివరావు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దండుగుల వరప్రసాద్(24) డిగ్రీ పూర్తి చేసి వ్యవసాయ పనులు చేసేవారు.
బీబీపేట మండల కేంద్రానికి చెందిన ఓ అమ్మాయిని ఫిబ్రవరిలో ప్రేమ వివాహం చేసుకొని బీబీపేట ఠాణాకు తీసుకొచ్చారు. ఈ సమయంలో అమ్మాయి కుటుంబసభ్యులు పది రోజుల తరువాత పెద్దల సమక్షంలో వివాహం చేయిస్తామని యువతిని ఒప్పించారు.
ఈ మేరకు ఠాణాలో లేఖ రాసిచ్చి ఆమెను తీసుకెళ్లారు. పది రోజుల తర్వాత అమ్మాయి మనసు మార్చుకొని ఎవరంతట వారు ఉందామని చెప్పి వెళ్లిపోయింది.
మనస్తాపం చెందిన వరప్రసాద్ మార్చి 24న మెదక్ జిల్లా రామాయంపేట శివారులో పురుగుల మందు తాగాడు. వెంటనే సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతిచెందారు.
యువతి, ఆమె కుటుంబసభ్యులే తన కొడుకు చావుకు కారణమని తండ్రి దండుగుల స్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.
ప్రేమికులను ఎస్సై సాయికుమార్ విడదీశారంటూ మండల కేంద్రంలోని ఆయా చోట్ల ఆయనతోపాటు వరప్రసాద్ పెళ్లి చేసుకున్న చిత్రాలతో సహా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఈ విషయం ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టింది. పెళ్లి చేసుకొని ఠాణాకు వెళ్తే అమ్మాయిని బెదిరించి కుటుంబసభ్యులకు అప్పగించారని ఆరోపించారు.
జిల్లా కేంద్రంలో ఆందోళన
వరప్రసాద్ ఆత్మహత్యకు కారణమైన ఎస్సైని విధుల నుంచి తొలగించాలని ఆయన కుటుంబీకులు, బంధువులు జిల్లా ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు.
గంటకుపైగా రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. చివరకు పోలీసులు సముదాయించడంతో ఆందోళన విరమించారు.