
ఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసుకు సంబంధించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ”టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్..
తీగలాగితే ప్రగతిభవన్ డొంక కదిలిందా?.. విచారణలో ‘బావ’.. తెలంగాణ సీఎంవోలో బావమరిది?.. మీకు అర్థం అవుతుందా ”పరువు” గల కేటీఆర్ గారూ…?” అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే టీఎస్‌పీఎస్‌సీ సభ్యుడు లింగారెడ్డి బయోడేటాను జతచేశారు. ప్రస్తుతం రేవంత్ ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అసలు ఇంతకీ ఆయన చెప్పిన బావబామ్మర్ధులు ఎవరు అనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది.
ఇదిలావుండగా.. పేపర్ లీక్ కేసులో సిట్ దూకుడు పెంచింది. దీనిలో భాగంగా కమీషన్ సభ్యులకు కూడా నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్, కమీషన్ సభ్యుడు లింగారెడ్డిలను సిట్ సుదీర్ఘంగా విచారించి స్టేట్‌మెంట్ రికార్డ్ చేసింది. ఈ కేసులో అరెస్ట్ అయిన రమేశ్.. లింగారెడ్డికి పీఏగా పనిచేయడంతో వీరిద్దరి అనుబంధంపై సిట్ ఆరా తీస్తోంది.
మరోవైపు.. పేపర్ లీక్ వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి శుక్రవారం ఈడీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో లక్షలాది రూపాయలు చేతులు మారాయని, హవాలా కోణం కూడా వుందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం లక్షల మంది ఉద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతోందన్నారు. మనుషుల వేషంలో మృగాలు రాష్ట్రాన్ని ఏలుతున్నాయని తీవ్ర వ్యాఖయలు చేశారు. నియామక ప్రక్రియ జాగ్రత్తగా చేయాలని.. ఇంత జరిగినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదంటూ రేవంత్ దుయ్యబట్టారు. ప్రశ్నాపత్రాలను వందల కోట్లకు అమ్ముకుంటున్నారని.. దీనికి సంబంధించిన ఆధారాలు బయటపెడితే, విపక్షాలపైనే కేసులు పెడుతున్నారని.. సిట్‌తో నోటిసులు ఇప్పిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
న్యాయం చేయాలని కోరుతూ రోడ్డెక్కిన విద్యార్ధులపై కేసులు పెట్టడంతో పాటు అక్రమంగా అరెస్ట్‌లు చేస్తున్నారని రేవంత్ ఫైర్ అయ్యారు. విద్యార్ధులపై కేసులు పెట్టడంతో పాటు అరెస్ట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పేపర్ లీక్ కేసులో కోట్ల రూపాయలను కొల్లగొట్టిన వారిని అరెస్ట్ చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కాన్ఫిడెన్షియల్ రూమ్ ఇన్‌ఛార్జ్ శంకర్ లక్ష్మీకి తెలియకుండా ఎవ్వరూ లోనికి వెళ్లడానికి వీల్లేదన్నారు. ఛైర్మన్, సెక్రటరీకి తెలియకుండా ఎవ్వరూ ఏం చేయలేరని ఆయన ఆరోపించారు. సిట్ శంకర్ లక్ష్మీని విట్‌నెస్ కింద వుంచిందని, కానీ నిందితురాలిగా చేర్చాలని రేవంత్ డిమాండ్ చేశారు.
చిన్న ఉద్యోగులను బలి పశువులను చేసే ప్రయత్నం జరుగుతోందని రేవంత్ ఆరోపించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో పిటిషన్ వేశామని.. దీనిపై విచారణ జరుగుతోందన్నారు. విదేశాల నుంచి వచ్చి అనేక మంది ఎన్ఆర్ఐలు పరీక్షలు రాశారని దీనిపైనా విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. పేపర్ లీక్ ద్వారా వచ్చిన సొమ్మును ప్రవీణ్, రాజశేఖర్‌లు హవాలా మార్గంలో విదేశాలకు తరలించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందుకే తాము ఈడీకి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.