
కృష్ణా నదిలో డెడ్‌బాడీ.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భార్య
7 నెలల తర్వాత జాలర్ల వలకు చిక్కింది
దేవరకొండ : కృష్ణా నది బ్యాక్‌వాటర్‌లో జాలర్ల వలకు ఓ డెడ్‌బాడీ చిక్కింది.
వివాహేతర సంబంధం నేపథ్యంలో భార్యే అతడిని ఏడు నెలల క్రితం హత్య చేయించినట్లు తేలింది. నేరేడుగుమ్ము పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా త్రిపురారం మండలం లావుడ్య తండాకు చెందిన ధరావత్ రాగ్యానాయక్(40) హైదరాబాద్‌లో టాక్సీ డ్రైవర్ గా చేస్తున్నాడు. రాగ్యానాయక్భార్య రోజా ఆమె బావ లక్పతితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
తన సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని అతనిని చంపాలని లక్పతితో కలిసి పథకం వేసింది. నేరేడుగుమ్ము మండలం బుగ్గ తండాకు చెందిన పాతావత్ మాన్సింగ్, వాంకడోతు బాలాజీ అనే ఇద్దరూ వ్యక్తులతో సుపారీ మాట్లాడుకుంది.
గత ఏడాది ఆగస్ట్18న మాన్సింగ్, బాలాజీ కృష్ణా బ్యాక్ వాటర్ వద్ద చేపలు తక్కువ ధరకు దొరుకుతాయని, తెచ్చుకుందామని రాగ్యానాయక్‌ను నమ్మించారు.
అతడిని బుగ్గతండా సమీపంలో ఉన్న కృష్ణా బ్యాక్ వాటర్ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ రాగ్యానాయక్‌ను హత్య చేసి శవాన్ని వలలో చుట్టి రాళ్లు కట్టి నదిలో పడేశారు.
తర్వాత తన భర్త కనిపించడం లేదని రోజా హైదారాబాద్‌లోని రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మిస్సింగ్‌కేసు నమోదు చేసుకున్న పోలీసులు భార్యపై అనుమానంతో కాల్‌డేటా ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు.
కృష్ణా నదిలో గాలించినప్పటికీ డెడ్‌బాడీ దొరకలేదు. గురువారం నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్ లో జాలర్లు చేపల కోసం వల వేయగా రాగ్యానాయక్ మృత దేహం బయటపడింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
డెడ్‌బాడీని దేవరకొండ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు.