
నాడు తమ్ముడు.. నేడు అన్న నవమి రోజే ఇద్దరు మృతి
వైరా మండలంలోని గరికపాడు గ్రామంలో సీతారామచంద్రుల పెళ్లి రోజునే ఇద్దరు అన్న దమ్ములు అసువులు బాసారు. గరికపాడులోని శీలం వెంకటేశ్వర్ రెడ్డి, శీలం కరుణాకర్రెడ్డి అన్నదమ్ము లిద్దరూ శ్రీరామనవమి రోజే మృతిచెందడం గ్రామంలో విషాదం నింపింది.
కరోనా మహమ్మారితో 2021 శ్రీరామనవమి ఏప్రిల్ 21 న ఆ గ్రామ మాజీ సర్పంచ్ శీలం కరుణాకర్రెడ్డి మృతిచెందారు.
ఆ తర్వాత ఏప్రిల్ 30 వతేదీన కరుణాకర్ రెడ్డి సతీమణి హరిత కూడా కరోనా మహమ్మారికి బలైంది. కేవలం అన్న దమ్ముల అనుబంధమే కాకుండా స్నేహితులు మాదిరిగా కరుణాకర్ రెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి ఉండేవారు.
తమ్ముడి అకాల మరణంతో తీవ్ర మానసిక వేదనకు గురైన అన్న వెంకటేశ్వర్రెడ్డి కొంతకాలానికే అనారోగ్యానికి గురయ్యాడు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ శ్రీరామనవమి గురువారం వెంకటేశ్వరరెడ్డి మృతిచెందాడు.
అన్నదమ్ములిద్దరూ శ్రీరామనవమి రోజునే మరణించడంతో గ్రామస్థులు గుర్తుచేసుకొని కన్నీరు మున్నీరవుతున్నారు. కరుణాకర్ రెడ్డి కరోనాతో మరణించగా వెంకటేశ్వర్ రెడ్డి క్యాన్సర్ మహమ్మారితో మృత్యువాతపడ్డారు.