
బండి సంజయ్ ఇంట తీవ్ర విషాదం
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. బండి సంజయ్ అత్తమ్మ చిట్ల వనజ సోమవారం ఉదయం మృతి చెందారు.
దీనితో బండి సంజయ్ కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కాగా 2 రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురైన వనజ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ఈరోజు మృతి చెందారు.
ఆమె మరణవార్త తెలుసుకున్న బండి సంజయ్ (Bandi Sanjay) హుటాహుటీన కరీంనగర్ కు చేరుకున్నారు. ఆమె పార్ధివదేహాన్ని జ్యోతినగర్ లోని సొంతింటికి తరలించారు.
ఈ విషయం తెలుసుకున్న మంత్రి గంగుల కమలాకర్ వనజ నివాసానికి చేరుకొని ఆమె పార్ధివదేహానికి నివాళులు అర్పించారు.
అలాగే కరీంనగర్ మేయర్ సునీల్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగడి కృష్ణారెడ్డి ఆమె పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇక బండి సంజయ్ (Bandi Sanjay) అత్తమ్మ మరణవార్త తెలుసుకున్న బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున జ్యోతి నగర్ కు చేరుకుంటున్నారు.
ఇదిలా ఉంటే పేపర్ లీకేజీపై బండి సంజయ్ చేసిన ఆరోపణలపై ఆధారాలు ఇవ్వాలని సిట్ నోటీసులు ఇచ్చింది. అయితే రెండుసార్లు ఆయనకు నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరు కాలేదు.
తనకు సిట్ పై విశ్వాసం లేదన్న బండి నా దగ్గర ఉన్న ఆధారాలను నమ్మకం ఉన్న సంస్థలకే ఇస్తానని చెప్పుకొచ్చారు. పేపర్ లీకేజ్‌పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందే అంటున్న బండి సంజయ్.. మొదటి నుంచి సిట్ దర్యాప్తును లెక్కలోకి తీసుకోవట్లేదు.
అందుకే ఆయన సిట్ అధికారులకు ఆధారాలు ఇచ్చేది లేదంటున్నారు. తనకు నోటీస్ ఇచ్చినట్లుగానే మంత్రి కేటీఆర్‌కి కూడా ఇవ్వగలరా అని సిట్ అధికారులకు సవాల్ విసురుతున్నారు.
మరి రానున్న రోజుల్లోనైనా బండి సంజయ్ సిట్ విచారణకు వెళ్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.