
స్నేహితుడి పుట్టినరోజు.. బిర్యానీ కోసం వెళ్తుండగా ప్రమాదం
ఖమ్మం : ముగ్గురి నడుమచిన్నప్పడే మొదలైన స్నేహం కొనసాగుతుండగా ఎక్కడికై నా కలిసే వెళ్లివచ్చేవారు. ఇందులో ఓ స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు.
రాత్రి పొద్దుపోయాక బిర్యానీ తినాలని అనిపించడంతో బైక్‌పై బయలుదేరారు. ఈక్రమంలో బైక్‌పై వేగంగా వెళ్తున్నట్లు తెలుస్తుండగా అదుపు తప్పడంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా.. మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరగగా, శనివారం ఉదయం ఖమ్మం ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం అనంతరం మేడేపల్లికి మృతదేహాలను తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.
ఎప్పుడు కలిసి కనిపించే ముగ్గురిలో ఇద్దరు మృతి చెందడం, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ముదిగొండ మండలం మేడేపల్లికి చెందిన పోతునూక శివరామకృష్ణ(21), పగిళ్ల ఉదయ్‌కుమార్(21) డిగ్రీ ద్వితీయ సంవత్సరం ఖమ్మంలోని ప్రైవేట్ కళాశాలలో చదువుతున్నారు. వీరి స్నేహితుడు అదే గ్రామానికి చెందిన పొలగాని రవీందర్ పుట్టిన రోజు సందర్భంగా ముగ్గురు శుక్రవారం సాయంత్రం ఊరి చివరి సాగర్ కాల్వ బ్రిడ్జి కేక్ కట్ చేసి వేడుక జరుపుకున్నారు.
రాత్రి పొద్దుపోయే వరకు అక్కడే గడిపిన వీరు బిర్యానీ తినాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో రవీందర్ బైక్‌పై ఉదయ్‌కుమార్, శివరామకృష్ణతో కలిసి ఖమ్మం బయలుదేరారు.
ఈక్రమంలో వీరు వేగంగా వెళ్తున్నట్లు తెలియగా.. ఖమ్మంలోని చర్చి కాంపౌండ్ బ్రిడ్జిపై అదుపు తప్పి డివైడర్‌కు ఢీకొట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఉదయ్, శివరామకృష్ట అక్కడికక్కడే మృతి చెందగా, రవీందర్ తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నాడు.
పేద కుటుంబాలు…
శివరామృష్ట తండ్రి పోతునూక నాగేశ్వరరావు ఆర్టీసీలో, ఉదయ్ తండ్రి మురళి మేడేపల్లిలో ట్రాక్టర్ డైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరివి పేద కుటుంబాలే కావడం, చేతికి వస్తున్నారనుకుంటున్న కొడుకులు కన్నుమూయడంతో తల్లిదండ్రులు రోదనలకు అంతు లేకుండా పోయింది. ఇక ఉదయ్, శివరామకృష్ణ అంత్యక్రియలు స్వగ్రామంలో నిర్వహించగా బంధువులు, స్నేహితులు వందలాదిగా చేరుకుని నివాళులర్పించారు.
అందరితో కలిసి మెలిసి ఉండే వీరి మృతదేహాలను చూసిన స్నేహితులు సైతం కంటతడి పెట్టారు. కాగా, శివరామకృష్ణకు తల్లిదండ్రులతో పాటు ఓ సోదరి ఉండగా, ఉదయ్‌కు తల్లిదండ్రులు, ఓ సోదరి ఉన్నారు.
రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు
ఖమ్మంక్రైం : ఖమ్మం చర్చి కాంపౌండ్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంపై వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ముదిగొండ మండలం మేడేపల్లికి చెందిన యువకులు శివరామకృష్ణ,, పగిళ్ల ఉదయ్ మృతి చెందగా, రవీందర్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఘటనపై శివరామకృష్ణ తండ్రి నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసశామని సీఐ చిట్టిబాబు తెలిపారు.
మాకెవరు దిక్కు..
డిగ్రీ చదువుతున్న నా కొడుకు కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటాడని అనుకున్నాం. కానీ అసలే లేకుండా పోయాడు. ఇప్పుడు మాకెవరు దిక్కు. ట్రాక్టర్ డ్రైవర్‌గా నేను ఎక్కడ ఉన్నా ప్రతిరోజు వచ్చి మాట్లాడి వెళ్లేవాడు. ఇప్పుడు నా కొడుకు మాటలే కరువయ్యాయి. – పగిళ్ల మురళి, ఉదయ్ తండ్రి
చెప్పే బయటకు వెళ్లేవాడు..
నా కొడుకు ఏ నాడు చెప్పకుండా బయటకు వెళ్లేవాడు కాదు. ఎక్కడికై నా చెప్పేవాడు. శివతో పాటు ఆయన అక్కడ మాకు అండగా ఉంటామని చెప్పేవారు. ఒక్కగానొక్క కొడుకు కావడంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాం. ఇప్పుడు ఈ ఘోరం జరిగిపోయింది. – పుష్పవతి, శివరామకృష్ణ తల్లి