
మాకు చెప్పకుండా స్కూల్‌ను ఎందుకు డెవలప్ చేశారు: హెచ్ఎంకు షోకాజ్ నోటీసులు
మెదక్ జిల్లా కేంద్రంలోని గర్ల్స్ హైస్కూల్‌ను ఓ స్వచ్ఛంద రూ.40 లక్షలు ఖర్చు చేసి రినోవేషన్ చేసింది. శిథిలావస్థకు చేరుకున్న బిల్డింగ్‌ను..
అధునాతన హంగులతో అందంగా తీర్చిదిద్దింది. అయితే దీనిపై ఆ పాఠశాల హెచ్ఎం, ఎంఈవోలు షోకాజ్ నోటీసులు ఎదుర్కొన్నారు. ఈ విషయం ఇప్పుడు స్థానికంగా చర్చనీయంగా మారింది. మంచి పనులు చేస్తే షోకాజ్ నోటీస్ ఏంటి అనుకుంటున్నారా.. అయితే ఇది చదివేయండి.
హెచ్ఎంకు షోకాజ్ నోటీసులు
మెదక్ జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూల్ హెడ్ మాస్టర్, మెదక్ మండల ఎంఈవోలకు డీఈవో షోకాజ్ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కుమారుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్ గర్ల్స్ హైస్కూల్‌ను దత్తత తీసుకున్నారు.
దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ స్కూల్ బిల్డింగ్ అధ్వాన్నంగా తయారైంది. దీంతో స్టూడెంట్స్, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో స్కూల్‌ను దత్తత తీసుకుని దాదాపు రూ.40 లక్షలకు పైగా ఖర్చు చేసి బిల్డింగ్‌ను రినోవేశన్ చేయడంతో పాటు.. నూతనంగా టాయిలెట్స్‌ను నిర్మించారు.
మినరల్ వాటర్ ప్లాంట్, కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. ఇదే కాకుండా.. స్కూల్ చుట్టూ గ్రీనరీని డెవలప్ చేశారు. ఈ పనులతో స్కూల్ రూపు రేఖలు పూర్తిగా మారిపోయి కార్పొరేట్ స్కూల్‌ను తలపిస్తోంది.
స్కూల్లో మంచి పని చేస్తే.. షోకాజ్ నోటీసులు: కాగా ముందస్తుగా తమ అనుమతి లేకుండా స్వచ్ఛంద సంస్థతో స్కూల్లో పనులు ఎలా చేయించారంటూ గర్ల్స్ హైస్కూల్ ఇంఛార్జి హెడ్ మాస్టర్ రేఖతో పాటు, మండల విద్యాధికారి(ఎంఈవో) నీలకంఠంలకు డీఈవో రాధకిషన్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
స్కూల్ రినోవేశన్ పనులను ఇంతకు ముందు పని చేసిన డీఈవో రమేశ్ కుమార్ కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించడం గమనార్హం. ఈ మేరకు స్కూల్లో మంచి పనులు చేయిస్తే అభినందించాల్సింది పోయి షోకాజ్ నోటీసులు ఇవ్వడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఇదిలా ఉండగా.. రానున్న ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసే ఆలోచనతోనే మైనంపల్లి హనుమంతరావు తన కుమారుడు ఛైర్మెన్‌గా ఉన్న ఎంఎస్ఎస్వో ఆధ్వర్యంలో నియోజకవర్గంలో సోషల్ సర్వీస్ ప్రారంభించారని పలువురు ఆరోపిస్తున్నారు.
దీంతో వారికి పేరొస్తుందనే ఉద్దేశంతో అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఆఫీసర్లపై ఒత్తిడి తెచ్చి.. హెచ్ఎం, ఎంఈవోలకు షోకాజ్ నోటీసులు ఇప్పించారనే ప్రచారం జరుగుతోంది.
పర్మిషన్ తీసుకోలేదని..: ఈ విషయమై డీఈవో రాధకిషన్ను వివరణ కోరగా.. ప్రభుత్వ స్కూల్లో స్వచ్ఛంద సంస్థలు ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటే ముందస్తుగా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.
అలా పర్మిషన్ తీసుకోకుండా పనులు చేయించినందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు హెచ్ఎం, ఎంఈవోలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు.