
మద్యం మత్తులో యువకుల వీరంగం
ఆసుపత్రిలో ధ్వంసమైన సామగ్రి
మద్యం మత్తులో వీరంగం సృష్టించిన యువకులపై గురువారం పట్టణ ఠాణాలో కేసు నమోదు చేశారు.
వివరాల్లోకెళితే… కొత్తగూడెం పట్టాణానికి చెందిన మాణిక్యం లోకేశ్, పటేల్ పూర్ణచంద్రరావు, పల్లా సాయికుమార్ గురువారం ఆటోలో పాల్వంచ నవభారత్‌లోని మద్యం దుకాణానికి వచ్చారు.
కొద్దిసేపటి తర్వాత మత్తులో ఎమ్మార్పీ ధరల విషయమై దుకాణ నిర్వాహకుడు కె.వేణుతో విషయమై గొడవపడ్డారు. ఆ సమయంలో ఆగ్రహానికి గురైన ఆ యువకులు లోపలకు దౌర్జన్యంగా ప్రవేశించారు.
కౌంటర్ వద్దనున్న మద్యం సీసాలు పగులగొట్టారు. అనంతరం తప్పించుకుని ఆటోలో కొత్తగూడెం వైపు పారిపోయారు. రాంగ్ రూట్‌లో వేగంగా వెళ్తూ ఎదురుగా వచ్చే మరో ద్విచక్ర వాహనదారుడిని సైతం ఢీకొట్టారు. దీంతో ఆటో బోల్తా పడింది.
ద్విచక్ర వాహనదారుడికి స్వల్ప గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు డయల్ 100కు సమాచారమిచ్చారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితులు, బాధిత ద్విచక్రవాహనదారుడిని పాల్వంచ సీహెచ్‌సీలో చేర్పించారు. అక్కడా ఆసుపత్రి సిబ్బందితో గొడవ పడిన యువకులు అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు.
దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. మద్యం దుకాణం నిర్వాహకుడు, ఆసుపత్రి అధికారులు, దిచక్రవాహనదారుడి ఫిర్యాదులతో వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు.