
ఆగి ఉన్న బస్సును ఢీ కొట్టిన లారీ.. క్లీనర్ స్పాట్ డెడ్
చౌటుప్పల్: ఆగి ఉన్న బస్సును లారీ వెనుక నుండి ఢీ కొట్టిన సంఘటనలో ఒకరు మృతి చెందగా మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది.
ఈ ప్రమాదం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం స్టేజి వద్ద తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
సత్తుపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ వైపు వెళ్తుండగా లింగోజిగూడెం శివారు రాగానే తెల్లవారుజామున ప్రయాణికుల మూత్ర విసర్జన కోసం రోడ్డు ప్రక్కన బస్సును నిలిపారు.
ఇదే సమయంలో కూరగాయల లోడుతో హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ వేగంగా ఆర్టీసీ బస్సు వెనుక నుండి ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంతో బస్సు, లారీ రెండు రోడ్డు పక్కనే ఉన్న గుంతలో పడిపోయాయి. లారీ డ్రైవర్, క్లీనర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోగా పోలీసులు స్థానికుల సహయంతో వారిని క్యాబిన్లో నుండి తొలగించి చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు.
అయితే క్లీనర్ మార్గమధ్యలో మృతి చెందాడు. లారీ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. బస్సులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులకు కూడా గాయాలు కావడంతో చౌటుప్పల్ ఏరియా ఆసుపత్రిలో వారికి చికిత్స అందిస్తున్నారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు చౌటుప్పల్ సీఐ మల్లికార్జున్ రెడ్డి తెలిపారు.