
అధికారం ఉందని విర్రవిగుతున్నారు..! త్వరలోనే వడ్డీతో సహా ప్రతిఒక్కరి లెక్క తేలుస్తా…!!
టీఎస్పీఎసీ పేపరు లీకేజీతో 30లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు
ప్రభుత్వమే నిందితులను రక్షించే ప్రయత్నం చేస్తుంది
ఎంతోమంది అమరుల ఆత్మబలిదానాల పుణ్యమే తెలంగాణ
ప్రొఫెసర్ కోదండరామ్, నాలాంటి వారు లొంగలేదనే మాపై ఈ కక్ష సాధింపులు
త్వరలోనే రైట్ ఛాయిస్ సహకారంతో ఉమ్మడి జిల్లాలో జాబ్ మేళా ఏర్పాటు చేయిస్తా
నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు పూయిస్తా… అధైర్యపడొద్దు అండగా ఉంటా
రైట్ ఛాయిస్ నిరుద్యోగుల అవగాహన సదస్సులో మాజీ ఎంపీ పొంగులేటి కొత్తగూడెం : అధికారం ఎవడబ్బా సొత్తు కాదు… అధికారం ఉందని ఈ రోజు కొందరు విర్రవిగుతున్నారు… అది శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తెరగాలి… రాబోయే రోజులన్ని మనవే…
అధికారంతో విర్రవిగే ప్రతి ఒక్కరి లెక్కను త్వరలోనే వడ్డీతో సహా తేలుస్తానని ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. కొత్తగూడెం క్లబ్ లో రైట్ ఛాయిస్ అకాడమీ ఛైర్మన్ మెండెం కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన నిరుద్యోగుల అవగాహన సదస్సులో పొంగులేటి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
సుమారు మూడు వేల మందికి పైగా నిరుద్యోగులు పాల్గొన్న ఈ సదస్సును ఉద్దేశించి పొంగులేటి మాట్లాడుతూ టీఎస్ పీఎస్ సీ పేపరు లీకేజీతో 30లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుందని ఆరోపించారు.
ఈ కేసులో ప్రభుత్వానికి చెందిన అధికారులు, ప్రజాప్రతినిధుల పాత్ర కూడా ఉ ందని, వారిని ప్రభుత్వమే రక్షించే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు.
ఎంతోమంది అమరుల ఆత్మబలిదానాల పుణ్యమే తెలంగాణ అన్నారు. ప్రొఫెసర్ కోదండరామ్ సహా నా లాంటి వారు ఎందరో ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రశ్నించినందు వల్లనే మా పై ఈ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు.
ప్రభుత్వ ఉద్యోగాలు ఎలాగు ఈ ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదు. కావున తన ఆధ్వర్యంలోనే రైట్ ఛాయిస్ మెండెం కిరణ్ కుమార్ సహకారంతో ఉమ్మడి జిల్లాలో జాబ్ మేళాలను ఏర్పాటు చేయిస్తా… నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు పూయిస్తా… శీనన్న హామీ ఇస్తున్నాడు… అధైర్యపడొద్దు ధైర్యంగా ఉండండి… ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని పేర్కొన్నారు.
పంట నష్టపోయిన రైతాంగానికి కంటితుడుపు చర్యగా నామమాత్రపు నష్టపరిహాన్ని ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుందని విమర్శించారు. రాబోయే రోజులన్ని మనవే నని ప్రతిఒక్కరు ధైర్యంగా ఉండాలని మరోసారి నిరుద్యోగులకు భరోసా ఇస్తూ పొంగులేటి తన ప్రసంగాన్ని ముగించారు.