
మహిళలకు గుడ్ న్యూస్.. 1540 ఆశా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్
TS ASHA Worker Jobs 2023: తెలంగాణలో వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తున్నాయి.
ఓవైపు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నోటిఫికేషన్లు రాగా… ఆయా శాఖల నుంచి కూడా వేర్వురు నోటిఫికేషన్లు వస్తున్నాయి. ఇక వైద్యారోగ్యశాఖ నుంచి కీలకమైన ప్రకటనలు విడుదలవుతున్నాయి.
ఇందులో భాగంగా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ వైద్యారోగ్యశాఖ. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1540 ఆశా వర్కర్ల ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఖాళీల వివరాలను కూడా పేర్కొంది.
మూడు జిల్లాల్లో భర్తీ…
తాజా ప్రకటనలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు జిల్లాల్లో ఆశా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో చూస్తే… హైదరాబాద్ జిల్లాలో 323, మేడ్చల్ జిల్లాలో 974, రంగారెడ్డి జిల్లాలో 243 పోస్టులు ఉన్నాయి.
ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ భర్తీ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా భర్తీ చేస్తారని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందుకు సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్ త్వరలోనే రానుంది.
ఈ ఉద్యోగాలకు కేవలం మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పదో తరగతి పాసైన వారు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రజారోగ్యం, చిన్నపిల్లలకు టీకాలు, వ్యాక్సినేషన్ ప్రక్రియ, గర్భిణీ స్త్రీల పౌష్టికాహారం, వారి ఆరోగ్య వివరాలతో పాటు ఇతర ఆరోగ్య సేవలను అందిస్తారు.
గ్రామాల్లో ఆరోగ్య క్యాంపుల నిర్వహణలోనూ కీలక పాత్ర పోషిస్తారు. మన రాష్ట్రంలో ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి రూ.10వేలు చెల్లిస్తున్న సంగతి తెలిసిందే.
మరో నోటిఫికేషన్..
తెలంగాణ ప్రభుత్వ పరిధిలోని జాయింట్ డైరెక్టర్ (మెడికల్), ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ కార్యాలయం, హైదరాబాద్ పరిధిలోనూ పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 114 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 28ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు.
పోస్టుల ఆధారంగా ఎంబీబీఎస్, బీడీఎస్, ల్యాబొరేటరీ టెక్నీషియన్ సర్టిఫికెట్, డీఫార్మసీ పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. వయోపరిమితి 18 ఏళ్ల నుంచి 44 ఏళ్లు ఉండాలి.
అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://hyderabad.telangana.gov.in/ నుంచి ఫామ్ డౌన్లోడ్ చేసుకొని నింపాల్సి ఉంటుంది.
అప్లికేషన్ ఫామ్ ను పోస్టు లేదా వ్యక్తిగతంగా జాయింట్ డైరెక్టర్ (మెడికల్), ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్, హైదరాబాద్ , అయిదో అంతస్తు, హాస్టల్ బిల్డింగ్, ఈఎస్ఐ హాస్పటల్, సనత్ నగర్, నాచారం, హైదాబాద్ చిరునామాకు పంపించాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తును మార్చి 28వ తేదీ నాటికి చేరేలా పంపించాల్సి ఉంటుంది.