
నెలాఖరు వరకు 1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ : మంత్రి హరీశ్‌రావు
Minister Harish Rao | టీచింగ్ ఆసుపత్రుల పరిధిలో భర్తీ చేస్తున్న 1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామక ప్రక్రియను ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ఆదేశించారు.
టీచింగ్ ఆసుపత్రుల పరిధిలో భర్తీ చేస్తున్న 1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామక ప్రక్రియను ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ఆదేశించారు.
వెరిఫికేషన్ సహా ఇతర ప్రక్రియలు పూర్తి అయిన నేపథ్యంలో తుది ఫలితాలు విడుదల చేసేందుకు అవసరమైన చర్యలు సత్వరం చేపట్టాలని సూచించారు.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆలోచన మేరకు పేదలకు వైద్య ఖర్చుల భారం లేకుండా చేసి, నాణ్యమైన వైద్యం అందేలా చూడాలన్నారు. ఆరోగ్యశ్రీ పథకం అమలు, పురోగతిపై మంగళవారం మంత్రి నెలవారీ సమీక్ష నిర్వహించారు.
డీఎంఈ, డీపీహెచ్, టీవీవీపీ పరిధిలోని ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ కేసులు పెరగడంపై సంతోషం వ్యక్తం చేశారు. 2021-22తో పోల్చితే, 2022-23 ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి నెల చివరి వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కేసులు గణనీయంగా పెరిగాయని, డీఎంఈ పరిధిలో 72,225 నుంచి 1,08,223కు పెరగగా, టీవీవీపీలో 66,153 నుంచి 99,744కు పెరిగాయన్నారు. డీపీహెచ్ పరిధిలో కొత్తగా ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభం కావడంతో 14,965 కేసులు నమోదు అయ్యాయన్నారు.
ఈ పెరుగుదలకు కృషి చేసిన వైద్యారోగ్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. కొత్త మెడికల్ కాలేజీల ద్వారా మరిన్ని పీజీ సీట్లు అందుబాటులోకి రావడం, ఆసుపత్రుల్లో సౌకర్యాలు పెరగడం, ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరగడం, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిధిలోని ఆసుపత్రుల్లోనూ ఆరోగ్యశ్రీ సేవలు మొదలు పెట్టడంతో ఈ గణనీయమైన మార్పు సాధ్యమైందన్నారు. ఆరోగ్యశ్రీ బృందంతో పాటు, ఆరోగ్య మిత్రలు చేస్తున్న కృషి కూడా ఇందులో ఉందన్నారు.
ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ పథకాలు మరింత ప్రభావవంతంగా అమలయ్యేలా చూడాలన్నారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. వెల్నెస్ సెంటర్ల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు.
జూమ్ ద్వారా నిర్వహించిన సమీక్షలో హెల్త్ సెక్రెటరీ రిజ్వి, ఆరోగ్య శ్రీ సీఈవో విశాలాచ్ఛి, డీఎంఈ రమేశ్ రెడ్డి, నిమ్స్, ఎంఎన్‌జే డైరెక్టర్లు, ఆరోగ్యశ్రీ అధికారులు, జిల్లా కోఆర్డినేటర్లు, టీం లీడర్లు, అన్ని టీచింగ్, టీవీవీపీ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, అన్ని జిల్లాల డీఎంహెచ్వోలు పాల్గొన్నారు.