కవిత విచారణలో రివర్స్ అటాక్..

Spread the love

విచారణలో రివర్స్ అటాక్.. కవిత ప్రశ్నలకు ఈడీ అధికారులు నీళ్లు నమిలారా.. కొసమెరుపు ఏమిటంటే..!

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)

దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్‌ కుమార్తె కవితను వరుసగా రెండోరోజు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

సోమవారం నాడు పదిన్నర గంటల పాటు కవితపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈడీ ప్రశ్నలకు కవిత నుంచి ఎలాంటి సమాధానాలు రాలేదని బయటికి వార్తలు కూడా వచ్చాయి.

నిన్న ఉదయం 10.30 గంటలకు ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలోకి ప్రవేశించిన కవిత.. రాత్రి 9.15 గంటల ప్రాంతంలో బయటకు వచ్చారు. అయితే.. ఇవాళ ఎన్ని గంటలు విచారిస్తారో తెలియని పరిస్థితి. ఇదిలా ఉంటే.. నిన్నటి విచారణ ఇదిగో ఇలా జరిగిందని బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా కొన్ని విషయాలను తెగ వైరల్ చేస్తున్నారు.

ఇక వాట్సాప్, టెలీగ్రామ్‌లో అయితే వందలకొద్దీ గ్రూపుల్లో ఈ వార్తలు వచ్చాయి. ఇంతకీ బీఆర్ఎస్ శ్రేణులు వైరల్ చేసిన ఆ వార్త సారాంశం ఏంటో ఓ లుక్కేద్దాం రండి.

ఇదీ అసలు కథ..!
కవితపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారని.. ఆ ప్రశ్నలకు ఆమె నుంచి ఎలాంటి సమాధానాలు రాలేదని ఇప్పటి వరకూ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఈ వార్తలను పూర్తిగా ఖండిస్తున్నాయి. అంతటితో ఆగలేదు..

విచారణలో ఈడీ పైనే కవిత రివర్స్ అటాక్ చేశారని.. ఆమె సంధించిన ప్రశ్నలకు అధికారులు ఎలాంటి సమాధానం చెప్పకపోగా నీళ్లు నమిలారని బీఆర్ఎస్ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. ముఖ్యంగా ఈడీ డైరెక్టర్ అయితే అస్సలు సౌండే చేయలేదట. ఇలా ఒకట్రెండు కాదు.. చాలా విషయాలను ప్రస్తావిస్తూ కవిత గురించి సోషల్ మీడియాలో బీఆర్ఎస్ వర్గాలు వైరల్ చేస్తున్నాయి.

ఇందులో నిజమెంత..?
‘ కవితను ఈడీ అధికారులు11 గంటలపాటు 14 ప్రశ్నలు అడిగారు. పూర్తి స్థాయిలో విచారణకు సహకరిస్తున్నప్పటికీ సహాయ నిరాకరణగా చిత్రీకరించేలా ఈడీ కుట్ర పన్నుతోంది. ఇప్పటివరకూ కవితను ఎవరితో కూడా అధికారులు కాన్ఫ్రంట్ చేయలేదు.

ఎమ్మెల్సీ కవిత పాత్రకు సంబంధించి ఏ ఒక్క ఆధారం కూడా ఈడీ చూపెట్టలేకపోయింది. ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ ఒత్తిడిలో భాగంగానే ఈడీ విచారించింది. నేను ఎలాంటి తప్పు చేయలేదు.. ఇది కేవలం రాజకీయ కుట్ర అని విచారణలో కవిత కుండబద్ధలు కొట్టారు. రాజకీయ ఒత్తిడితో ఈడీ పారదర్శకత లోపించింది..

ఇది రాజకీయ వేధింపుల్లో భాగమని కవిత క్లియర్ కట్‌గా చెప్పేశారు. ఇలా ఒకటి తర్వాత ఒకటి కవిత రివర్స్ ఎటాక్‌గా ప్రశ్నలు సంధించడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ నీళ్లు నమిలారు. కేవలం పొలిటికల్ లైన్‌లో ఈడీ అధికారులు ప్రశ్నించారు. నన్ను నిందితురాలుగా పిలిచారా..? అని ఈడీ ఆఫీసర్లను కవిత ప్రశ్నించారు..

ఇందుకు అధికారులు బదులిస్తూ.. లేదు అని చెప్పారు. విచారణకు పిలిచి ఎలాంటి కాన్ఫ్రంటేషన్ చేయకుండా పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో అధికారులు విచారణ చేశారు. నేను విచారణకు పూర్తిగా సహకరిస్తున్నాను అని పదే పదే కవిత నొక్కి చెప్పారు.

సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉండగా ఇంత తొందరగా విచారించాల్సిన అవసరం ఏముంది..? అని ఈడీ అధికారులపై కవిత ప్రశ్నాస్త్రాలు సంధించారు. గత విచారణలో స్వాధీనం చేసుకున్న తన ఫోన్ పూర్తిగా చెక్ చేసుకోవచ్చని అధికారులకు కవిత స్పష్టం చేశారు.

తను ఫోన్ ధ్వంసం చేసినట్టు మీడియాకు లీకులు ఎవరు చెప్పారు..? ఈడీ అధికారులను కవిత ప్రశ్నించారు. ఆమె ప్రశ్నలతో అధికారులు కంగుతిన్నారు’ అని ఈడీ అధికారులపై కవిత ప్రశ్నాస్త్రాలు సంధించినట్లు బీఆర్ఎస్ శ్రేణులు వార్తలను వైరల్ చేస్తున్నాయి.

వాళ్ల సంగతేంటి..!?
‘బీజేపీలో చేరగానే మరుగునపడ్డ కేసుల గురించి కూడా విచారణలో కవిత ప్రస్తావించారు. కవిత పదే పదే ఇలా ప్రశ్నాస్త్రాలు సంధించడంతో సమాధానాలు చెప్పలేక ఈడీ అధికారులు నీళ్లు నమిలారు.

బీజేపీలో చేరాక మరుగున పడ్డ హిమంతా బిశ్వశర్మ, సుజనా చౌదరితో పాటు పలు కేసులను కవిత ప్రస్తావించారు. అంతేకాదు.. కవిత ఈడీ కార్యాలయానికి చేరుకున్న గంట వరకూ అధికారులు రాలేదు.

వచ్చాక గంటలపాటు రూమ్‌లో ఒక్కరినే కూర్చోబెట్టి కవితను ఈడీ అధికారులు మానసికంగా హింసించారు. ఈడి అధికారుల విచారణలో పారదర్శకత లేదు.

విచారణ మొత్తాన్ని ఆడియో, వీడయో రికార్డ్‌ చేయాలని కవిత కోరారు. ఆమె విజ్ఞప్తిని అంగీకరించిన ఈడీ అధికారులు విచారణ మొత్తాన్ని రికార్డ్ చేశారు’ అని బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియా రాసుకొస్తున్నాయి. ఇందుకు పలువురు నెటిజన్లు, బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు స్పందిస్తూ తీవ్ర స్థాయిలో కౌంటర్ల వర్షం కురిపిస్తున్నారు.

అయితే ఈ విషయాలు బీఆర్ఎస్ శ్రేణులకు ఎవరు చెప్పారు..? ఇందులో నిజానిజాలెంత అనేది పైనున్న పెరుమాళ్లకే ఎరుక. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం స్వయంగా కవితనో.. లేకుంటే కవిత తరఫు న్యాయవాదులో మీడియా ముందుకు రావొచ్చు కదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే.

కొసమెరుపు ఏమిటంటే..!
వాస్తవానికి సోమవారం నాడు సుదీర్ఘ విచారణ తర్వాత ఈడీ కార్యాలయం లోపలి నుంచి బాగా కందిపోయిన ముఖంతో కవిత బయటికొచ్చారు. కారులో కూర్చున్న తర్వాత ముఖానికి కాస్త చిరునవ్వు పులుముకుని కార్యకర్తలకు విజయసంకేతం చూపించారు.

నిజానికి కవితను సోమవారం అరెస్టు చేసే అవకాశాలు లేవని ఈడీ అధికారి ఒకరు ఉదయాన్నే మీడియాకు అనధికారికంగా వెల్లడించారు. అయితే మంగళవారం విచారణ తర్వాత ఆమెను అరెస్టు చేసే అవకాశాలు లేవని చెప్పలేనని అదే అధికారి పేర్కొనడం గమనార్హం.

విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. కవితను ఈడీ కార్యాలయం రెండవ అంతస్తులోని ఒక గదిలో సుదీర్ఘంగా విచారించారు. దర్యాప్తు అధికారి జోగీందర్‌, ఒక మహిళా అధికారితో పాటు ముగ్గురు అధికారులు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు.

నిజానికి ఈ కుంభకోణంలో కీలకపాత్ర పోషించిన అరుణ్‌ పిళ్లైతో కవితను ముఖాముఖి కూర్చోబెట్టి ప్రశ్నించాలని అధికారులు భావించారు. కానీ అందుకు పిళ్లై అంగీకరించకపోవడంతో.. ఆయనను సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కోర్టు ముందు ప్రవేశపెట్టారు.

మొత్తానికి చూస్తే..
కవితను ఈడీ అధికారులు ఏం అడిగారో.. కవిత ఏం సమాధానాలు ఇచ్చారో తెలియట్లేదు కానీ.. అటు బీఆర్ఎస్ శ్రేణులు.. ఇటు కొన్ని మీడియా సంస్థలు మాత్రం తమకు తోచినట్లుగా మలుచుకుని వార్తలు మాత్రం తెగ రాసేస్తున్నాయి.

ఫైనల్‌‌గా ఈ కేసు నుంచి కవిత కేవలం ఆరోపణలతోనే బయటపడతారో.. లేకుంటే నిందితురాలుగా అరెస్ట్ అవుతారో తెలియాలంటే విచారణ పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందే మరి.

8,802 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?