
మత్తులో లారీ డ్రైవర్.. ఆటోను ఢీకొన్న లారీ..
హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం గుడెప్పాడ్ సర్కిల్‌లో జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు జిల్లా దేవగిరిపట్నం మైనారిటీ వసతి గృహంలో విధులు నిర్వహించే బోధనేతర ఉద్యోగులు కర దేవి, విజయ, రేష్మ, కరబాయి, సరోజన, ప్రమీల, మైదమ్మ, బాలు, రాందాస్లు
ములుగు నుంచి ఆటోలో హనుమకొండ వెళ్తుండగా గూడెప్పాడ్ సర్కిల్ వద్దకు రాగానే భూపాలపల్లి జిల్లా నుంచి బొగ్గు లోడ్ చేసుకొని అటుగా వెళ్తున్న లారీ అతివేగంగా ఆటోను ఢీ కొట్టి, పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి, ఇంటి ముందు ఉన్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో ద్విచక్ర వాహనం నుజ్జు నుజ్జు అయింది.
సమీపంలోని ఇంటి వద్దకు దూసుకెళ్లి ఆగింది. అటో ముందు బాగం నుజ్జునుజ్జు అయింది.
ఆటోలోని ముగ్గురికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న సీఐ కుమార్, ఎస్సై ప్రసాద్ క్షతగాత్రులను 108 వాహనంలో ఎంజీఎంకు తరలించారు. లారీ డ్రైవర్ పరారీ అయ్యాడు.
డ్రైవర్ అజాగ్రత్త వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు తెలిపారు.