
పేపర్ల లీకేజీ ఘటనపై నిరసనల వెల్లువ
హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) పేపర్ లీక్ పై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వంతో పాటు TSPSC బోర్డు తీరుపై విమర్శలు వస్తున్నాయి.
టీఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్థన్ రెడ్డి రాజీనామా చేయాలనే డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి.
టీఎస్‌పీఎస్సీ చైర్మన్ అరెస్ట్ కు డిమాండ్
తార్నాకలోని ఉస్మానియా యూనివర్శిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థులు నిరసన దీక్ష చేపట్టారు.
TSPSC పేపర్ లీకేజీ ఘటనలో చైర్మన్ జనార్ధన్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. టీఎస్‌పీఎస్సీ బోర్డును సైతం రద్దు చేయాలని, పేపర్ల లీకేజీ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు.
లెఫ్ట్ సంఘాల ఆధ్వర్యంలో..
టీఎస్‌పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తూ.. ఉస్మానియా యూనివర్శిటీ లైబ్రరీ నుండి లా కళాశాల వరకూ వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు.
TSPSC బోర్డును ప్రక్షాళన చేసి, ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఓయూ లైబ్రరీ నుండి లా కళాశాల వరకు భారీ ర్యాలీ చేపట్టి.. అక్కడే బైఠాయించి.. నిరసన తెలిపారు.
ఓ విద్యార్థి గుండు గీయించుకుని.. తనదైన స్టైల్లో రోడ్డుపై నిరసన తెలిపాడు. పేపర్ల లీకేజీ ఇష్యూపై గవర్నర్ తమిళి సై స్పందించాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరారు.