
“జాబ్ లేని జీవితం నాకొద్దు”..గ్రూప్ 1 రద్దుతో అభ్యర్థి ఆత్మహత్య..కన్నీళ్లు పెట్టిస్తున్న సూసైడ్ లెటర్
TSPSC పేపర్ లీకేజీ వ్యవహారం ఓ నిరుద్యోగి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. 6 ఏళ్లుగా కష్టపడి చదివి గ్రూప్ 1కు అర్హత సాధించానని ఆ యువకుడు తీవ్ర నిరాశకు గురయ్యాడు.
ఇక గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దవడంతో ఇక తనకు ఉద్యోగం రాదని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. అప్పటి వరకు కళ్ల ముందు ఉన్న కొడుకు విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతంగా మారింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా బీవై నగర్ నగర్ కు చెందిన నాగభూషణంకు నలుగురు కొడుకులు. అందులో చిన్న కొడుకు నవీన్ హోటల్ మేనేజ్ మెంట్ పూర్తి చేశాడు. ఇక ఉద్యోగాల కోసం సెర్చ్ చేశాడు. ఈ క్రమంలో ఇటీవల భారీగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు రావడంతో ప్రిపేర్ అవుతున్నాడు.
ఇందులో భాగంగా గతేడాది TSPSC నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను కూడా రాశాడు. ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో నవీన్ మెయిన్స్ కు అర్హత సాధించాడు. కానీ విధి తనను వక్రీకరించిందో..లేక కాలం పగబట్టిందో కష్టపడి గ్రూప్ 1కు అర్హత సాధిస్తే ఆ ఆనందం 6 నెలలు కూడా లేకపోయిందని నవీన్ కుమిలిపోయాడు. గ్రూప్ 1 పరీక్షను రద్దు చేస్తున్నట్టు TSPSC ప్రకటించడంతో కలత చెందిన నవీన్ లోలోపల కుమిలిపోయాడు.
ఇక తనకు ఉద్యోగం రాదన్న భయంతో ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నవీన్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నవీన్ మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
ఇక ఆత్మహత్య చేసుకునే ముందు నవీన్ సూసైడ్ లెటర్ రాశాడు. “నా చావుకు ఎవరూ కారణం కాదని..నాకు జాబ్ లేదు. నేను పనికిరాని వాడిని. సంతృప్తి లేని జీవితం నాది. థాంక్యూ మై ఫ్యామిలి. ఐ క్విట్” అంటూ నవీన్ రాసిన లెటర్ ప్రతీ ఒక్కరి చేత కంటతడి పెట్టిస్తుంది.
కాగా పేపర్ లీక్ తో TSPSC నిర్వహించే పలు పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని తట్టుకోలేక అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు..
ఈ క్రమంలో మళ్లీ హెగ్జామ్ నిర్వహిస్తే ఎంపిక అవుతామో కామో అన్న సందేహంలో నిరుద్యోగ యువత ఉన్నారు. దీనితో కఠిన నిర్ణయం తీసుకుంటున్నారు. కాగా ఇప్పటికే గ్రూప్ 1ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేసి కొత్త పరీక్ష తేదిని TSPSC ప్రకటించిన విషయం తెలిసిందే.