
పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి చావబాదారు!
దళిత యువకుడి ఆరోపణ
గుంటూరు జిల్లా మంగళగిరి కాజ టోల్‌గేట్ వద్ద బుధవారం అర్ధరాత్రి రాంగ్ రూట్‌లో ఓ ద్విచక్రవాహనంపై ముగ్గురు యువకులు దూసుకెళ్తుండగా టోల్‌గేట్ సిబ్బంది అడ్డుకోవడం, ఆ యువకులు వారితో గొడవపడుతున్నారని తెలుసుకుని పోలీసులు వెళ్లగా వారి మధ్య తీవ్ర వాగ్వాదం, పెనుగులాట చోటుచేసుకున్నాయి.
ఈ క్రమంలో దళిత యువకుడు నవీన్‌కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. తనను పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి చావబాదారని నవీన్ ఆరోపించారు. పోలీసుల దెబ్బలకు తన కాళ్లు, చేతులు వాచిపోయాయని, నోట్లో నుంచి రక్తం వచ్చిందంటూ ఫొటోలను గురువారం సామాజిక మాధ్యమాల్లో పెట్టారు.
బాధితుడికి మద్దతుగా లీగల్‌సెల్ న్యాయవాదులు, దళిత నాయకులు మంగళగిరి గ్రామీణ పోలీస్‌స్టేషన్‌కు చేరుకోవటంతో ఉద్రిక్తత ఏర్పడింది.
అప్రమత్తమైన ఉన్నతాధికారులు వేర్వేరు ప్రాంతాల నుంచి అదనపు బలగాలను రప్పించారు. బాధితుడి తరఫున వచ్చిన తెదేపా, దళిత నాయకులతో పోలీసులు మాట్లాడి రాజీ చేశారు. దీంతో కేసులు నమోదు కాలేదు.
ఈ విషయమై కాజ టోల్‌గేట్ వద్ద విధి నిర్వహణలో ఉన్న ఎస్సై విజయ్‌కుమార్‌రెడ్డిని వివరణ కోరగా నవీన్‌కుమార్, రెడ్డి మోహనసాయి, బోగి విజయ్‌కుమార్ అనే ముగ్గురు యువకులు మద్యం మత్తులో ఒకే వాహనంపై రాంగ్‌రూట్‌లో దూసుకెళ్తున్నారని చెప్పారు.
తానెవరినీ కొట్టలేదని, తమతో ఆ యువకులే దురుసుగా ప్రవర్తించారని చెప్పారు. వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌లో అప్పగించామని తెలిపారు.