
గురుకుల పాఠశాలలో గోడకూలి విద్యార్థి దుర్మరణం
మరో ఇద్దరికి గాయాలు
చివ్వెంల, గురుకుల పాఠశాల నీటిట్యాంకు గోడ కూలి ఒక విద్యార్థి మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి.
ఈ ఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల కేంద్రంలో గురువారం జరిగింది. విద్యార్థులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగారంలో సరైన వసతులు లేకపోవడంతో ఆ మండల జ్యోతిబాపులే బాలుర బీసీ గురుకుల పాఠశాలను ఓ ప్రైవేటు భవనంలో చివ్వెంలలో నిర్వహిస్తున్నారు. రోజూ మాదిరిగానే పాఠశాలలోని విద్యార్థులు గురువారం సాయంత్రం అక్కడి నీటిట్యాంక్ వద్ద స్నానాలు చేసేందుకు వెళ్లారు. ట్యాంక్‌కు రెండువైపులా నల్లాలు ఉన్నాయి.
ఓ వైపు ఎక్కువ మంది విద్యార్థులు స్నానాలు చేస్తుండటంతో.., ఖాళీలేక మరోవైపు ఉన్న నల్లాల వద్దకు అయిదో తరగతి చదువుతున్న మోతె మండలం అప్పన్నగూడేనికి చెందిన పవన్, మద్దిరాల మండలం చందుపట్ల వాసి సుశాంత్, నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం లింగోటం గ్రామానికి చెందిన యశ్వంత్‌లు వెళ్లారు. వీరు స్నానం చేస్తుండగా శిథిలావస్థలో ఉన్న నీటిట్యాంక్ గోడ కూలి వారిపై పడింది. గోడ కూలుతున్న సమయంలో యశ్వంత్, సుశాంత్‌లు తప్పించుకుని.. గాయాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడిన పవన్‌ను చికిత్స నిమిత్తం సూర్యాపేట జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. కానీ చికిత్స అందించేలోపే ఆ బాలుడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. గురుకుల పాఠశాలలో జరిగిన ప్రమాదం విచారకరమని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు.