
పట్టాభూమి ఆక్రమణకు కుట్ర
— నా కొడుకు ఆత్మహత్యాయత్నానికి కారకుడు సర్పంచ్
— నాయకన్ గూడెం సర్పంచ్ కాసాని సైదులుపై కఠిన చర్యలు తీసుకోవాలి
— విలేకరుల సమావేశంలో బాధితుని తల్లిదండ్రులు పోలెబోయిన వెంకన్న, సరోజిని
Pbc న్యూస్ ప్రతినిధి ఖమ్మం : పట్టా, పాస్ పుస్తకం కలిగి గత 15 సంవత్సరాలుగా అనుభవంలో ఉన్నటువంటి భూమిని ఆక్రమించుకునేందుకు దేవాలయం, ఇతర కారణాల పేరుతో నాయకన్ గూడెం సర్పంచ్ కాసాని సైదులు బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడుతూ.. అవమానకరంగా నోటికొచ్చినట్లు దూషించి నా కొడుకు ఆత్మహత్యాయత్నానికి కారకుడైన సర్పంచ్ పై జిల్లా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, నాయకన్ గూడెం గ్రామానికి చెందిన ఉపేందర్ తలిదండ్రులు పోలెబోయిన వెంకన్న, సరోజినిలు అన్నారు.
ఖమ్మం ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. నాయకన్ గూడెం గ్రామంలో గత 15 సంవత్సరాలుగా పట్టా పాస్ పుస్తకం కలిగి ఉన్న మేము నాలుగు కుంటల భూమిలో ఇల్లు కట్టుకుందామనుకుంటున్న సమయంలో ఆ భూమిని ఆక్రమించుకునేందుకు ఎటువంటి ఆధారాలు లేకపోయినా సర్పంచ్ కాసాని సైదులు గుడి పేరుతో, ఇతర కారణాలతో బెదిరింపులకు పాల్పడుతూ దౌర్జన్యంగా ఆడవారు అనేది కూడా చూడకుండా నానా బూతులు తిడుతుంటే విన్న మా కొడుకు పోలేబోయిన ఉపేందర్..
సర్పంచ్ దూషణలకు తట్టుకోలేక నా ఆత్మహత్యకు సర్పంచ్ కాసాని సైదులే కారణమని పురుగుల మందు తాగి ఆ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశాడు. ప్రస్తుతం ఉపేందర్ ఖమ్మం ప్రయివేట్ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.
దీనంతటికీ కారకుడైన సర్పంచ్ పై జిల్లా అధికారులు చట్టరీత్యా చర్యలు తీసుకొని అతను అక్రమంగా ఆక్రమించుకున్న భూములను, స్థలాలను గుర్తించి, మా భూమి మీదకు రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు.
ఎమ్మెల్యే పేరు చెప్పి ఆయనకు తెలియకుండానే ఇటువంటి ఆక్రమణలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు.
ఈ విలేకరుల సమావేశంలో పోలేబోయిన లింగయ్య, గడ్డం మురళి, బాల్య శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.