
గంటలో 13మందిపై వీధి కుక్కల దాడి ..
రోడ్లపైకి రావాలంటేనే వణికిపోతున్న జనం
రోజు రోజుకు వీధి కుక్కలు(Stray Dogs)రెచ్చిపోతున్నాయి.
గడప దాటి రోడ్డుపైకి రావాలంటే ఎక్కడ పిక్కలు పట్టుకొని పీకుతాయో..దాడి చేసి చంపుతాయో అనే భయం వదలడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కల దాడుల్లో జనం గాయపడుతున్నారు.
నిజామాబాద్ జిల్లాలో గ్రామ సింహాలు గర్జిస్తున్నాయి. ఊరిలో జనంపై పడి విచ్చలవిడిగా దాడి చేస్తూ జనాన్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. మెండోరా మండల కేంద్రంలో వీధి కుక్కలు జనంపై దాడి చేశాయి.
గంట వ్యవధిలో 13 మందిని కరిచి తీవ్రంగా గాయపరిచాయి. ఇద్దరిని ఛాతీపై, మరో ఇద్దరికి ఏకంగా ముఖంపై కరిచాయి. ఇద్దరిని కాళ్లు పట్టుకొని పీకగా.. మరో నాలుగురికి చేతిపై దాడి చేశాయి మాయదారి కుక్కలు.
కుక్కల దాడిలో గాయపడిన వాళ్లంతా వెంటనే మెండోరా మండల కేంద్రంలో హెల్త్ సెంటర్ కు తరలించారు. డాక్టర్ కుక్కల కాటు గురైన వారిని పరిశీలించారు.
8 మందికి తీవ్రంగా గాయాలైనట్లుగా తెలిపారు. మరో ఐదుగురికి స్వల్పంగా గాయపడ్డట్లు చెప్పారు. కుక్కల దాడిలో గాయపడిన వారిలో ఇద్దరికి సర్జరీ కూడా చేయాల్సి వస్తుందని డాక్టర్లు తెలిపారు.
జిల్లాలో ఈవిధంగా గంటల వ్యవధిలో పలుచోట్ల కుక్కలు జనంపై విరుచుకుపడటం చూసి స్థానికులు రోడ్లపైకి రావాలంటే గజగజ వణికిపోతున్నారు. ఏదైనా పనులపై ఇల్లు దాటాలంటే ధైర్యం చేయలేకపోతున్నారు.
గత మూడ్రోజుల్లో సుమారు 300 మందికిపైగా వీధి కుక్కల కాటుకు గురయ్యారు. హైదరాబాద్‌లో వీధి కుక్క దాడిలో బాలుడు చనిపోయినప్పటికి అధికారులు జిల్లాల్లో కుక్కలను నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై జనం మండిపడుతున్నారు.
రీసెంట్‌గా కామారెడ్డిలో ఓ వృద్ధురాలిని కుక్కలు తీవ్రంగా గాయపరిచాయి. వృద్ధురాలు ప్రాణాపాయం నుంచి బైటపడింది. ఇటీవల కాలంలో జిల్లాలో కుక్కల సంఖ్య భారీగా పెరిగింది
గతంలో ప్రతి ఏటా మున్సిపల్ అధికారులు కుక్కలకు కుటుంబ నియంత్రణ చికిత్సలు చేసే వారు. అయితే గత నాలుగైదేళ్లుగా ఆ సంగతి మర్చిపోయారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీల పరిధిలో నిజామాబాద్ నగర పాలక పరిధిలో కూడా కుక్కల నియంత్రణ కోసం ప్రత్యేక నిధులు కూడా విడుదల చేస్తున్నారు.
ఆ నిధులు ఎటుపోతున్నాయో తెలియదని స్థానికులు మండిపడుతున్నారు. ఎలాగైనా మండల కేంద్రంలో కుక్కల దాడులను నియంత్రించేందుకు అధికారులు ఇప్పటికైనా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
వీధి కుక్కల బెడద లేకుండా చూడాలని జనం కోరుతున్నారు. ముఖ్యంగా స్కూల్‌కు వెళ్లే పిల్లల దగ్గర నుంచి పనులకు బయటకువెళ్లే వారు సైతం వణికిపోతున్నారు. మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.