
రోగిని తరలిస్తున్న 108 అంబులెన్స్‌లో మంటలు
పేలిన ఆక్సిజన్ సిలిండర్
ఆ శకలాలు పడి రూ.40 లక్షల పొగాకు దగ్ధం
రోగిని తరలిస్తున్న 108 అంబులెన్స్‌లో మంటలు రేగి…
అందులోని ఆక్సిజన్ సిలిండర్ పేలింది. ఆ ధాటికి వాహన శకలాలు ఎగిరి సమీపంలోని పొగాకు మండెలపై పడడంతో ఆ నిల్వలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ క్రమంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా పామూరు మండలం రజాసాహెబ్‌పేటలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
రజాసాహెబ్‌పేటకు చెందిన మూత్రపిండాల వ్యాధి బాధితుడు పి.ఏసురాజును… డయాలసిస్‌కు తీసుకువెళ్లేందుకు కుటుంబీకులు 108కు ఫోన్ చేశారు. ఏసురాజును ఎక్కించుకుని కొద్ది దూరం వెళ్లేసరికి… షార్ట్‌సర్క్యూట్ కారణంగా డ్రైవర్ క్యాబిన్‌లో మంటలు వ్యాపించాయి.
పైలెట్ తిరుపతిరావు వెంటనే అప్రమత్తమై వాహనాన్ని ఆపేశారు. ఈఎంటీ మధుసూదన్‌రెడ్డిని అప్రమత్తం చేయడంతో పాటు… లోపలున్న రోగి, ఆమె తల్లిని కిందకు దించారు.
ఆ కాసేపటికే వాహనం అంతటికీ మంటలు విస్తరించాయి. లోపలున్న ఆక్సిజన్ సిలిండర్ పేలడంతో… ఆ ధాటికి వాహనం శకలాలు ఎగిరి సమీపంలోని పొగాకు మండెలపై పడ్డాయి.
రజాసాహెబ్‌పేటకు చెందిన రైతులు పొన్నగంటి నరసింహం, పద్మ, జయమ్మకు చెందిన… రూ.40 లక్షలకు పైగా విలువైన పొగాకు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. శకలాలు తగిలి సాధినేని వరదయ్యకు తీవ్ర గాయాలవడంతో ఒంగోలు తరలించారు.
ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భీతావహ వాతావరణం నెలకొంది. ఘటనా స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే, తెదేపా నియోజకవర్గ బాధ్యుడు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పరిశీలించారు. ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రుడిని పరామర్శించారు. తహసీల్దార్ ప్రసాద్, ఎస్సై కె.సురేష్ ప్రమాద వివరాలలను సేకరించారు.