
మరో ఇంటర్ విద్యార్థిని బలవన్మరణం.. పోలీసులు ఏం చెప్పారంటే..?
చదువులు విద్యార్థుల పాలిట ఉరికొయ్యలుగా మారుతున్నాయి. చదువులను భారంగా చూస్తున్న విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుని, అర్థంతరంగా తనువు చాలించి తల్లిదండ్రులను శోక సంద్రంలో ముంచుతున్నారు.
ముఖ్యంగా ఇటీవల ఇంటర్ చదువుతున్న విద్యార్థులు చనిపోవడం కలవరపాటుకు గురి చేస్తున్నాయి. హైదరాబాద్‌లోని నార్సింగ్ శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న సాత్విక్.. ఉపాధ్యాయులు వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య పాల్పడిన సంగతి విదితమే. ఆ ఘటన మర్చిపోక ముందే మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
ఈ ఘటన కూడా హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మాదాపూర్‌లో సాయినగర్‌లో నివాసముంటున్న కొండ కవిత దంపతుల కుమార్తె దివ్య ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. అయితే పరీక్షల్లో ఫెయిల్ అవుతానన్న భయంతో మనస్తాపానికి గురై డిప్రెషన్‌కు లోనైంది.
సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి వచ్చిన తల్లి.. కుమార్తె దివ్య చనిపోవడం చూసి భోరుమంది. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు.
తల్లి కవిత ఫిర్యాదుతో మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరీక్షలు దగ్గర పడుతుండటంతో ఒత్తిడిని తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు.
ప్రాథమిక దర్యాప్తులో.. సరిగ్గా చదవడం లేదని, పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే మనస్తాపంతో డిప్రెషన్‌కు లోనై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు.
దివ్య గత కొంతకాలంగా మానసికంగా బాధపడుతుందని, చదవలేకపోతున్నానని కుటుంబ సభ్యులు పేర్కొన్నట్లు తెలిపారు. ఈ ఆత్మహత్యపై తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులను ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అనంతరం దివ్య మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందించారు. కూతురి మృతితో తల్లిదండ్రులు కన్నీముమున్నీరుగా విలపిస్తున్నారు.