
బస్సులో ఉరివేసుకొని కండక్టర్ ఆత్మహత్య
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డిపోలో ఘటన
తొర్రూరు : ఓ కండక్టర్ ఆర్టీసీ బస్సులోనే ఉరి వేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్టీసీ డిపోలో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.
తొర్రూరు మండలం కంఠాయపాలెం గ్రామానికి చెందిన గార్లపాటి మహేందర్‌రెడ్డి (54) 1993లో ఆర్టీసీ కండక్టర్‌గా విధుల్లో చేరారు. తొర్రూరులోని టీచర్స్ కాలనీలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఆయనకు భార్య అరుణ, ఇద్దరు కుమారులు ఉన్నారు. మూడు రోజులుగా సెలవులో ఉన్న మహేందర్‌రెడ్డి..
ఆదివారం మధ్యాహ్నం 12 గంటల తరువాత డిపోకు వచ్చి డ్యూటీ చేస్తానని చెప్పి రిజిస్టర్‌లో పేరు రాయించుకున్నారు. తర్వాత ఎవరికీ కనిపించలేదు. సిబ్బంది ఫోన్ చేసినా స్పందించలేదు.
డిపో ఆవరణ చివరలో నిలిపిన ఓ బస్సులో టవల్‌తో ఉరివేసుకొని ఉన్న మహేందర్‌రెడ్డిని కార్మికులు గమనించి అధికారులకు సమాచారం అందించారు. ఆర్థిక ఇబ్బందులతో మహేందర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని ఆయన భార్య అరుణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.