
*జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మీ అరెస్ట్, రాజ్‌భవన్ వద్ద ఉద్రిక్తత*
హైదరాబాద్ రాజ్‌భవన్ వద్ద టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. హైదరాబాద్ మేయర్ బృందం .. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసేందుకు ప్రయత్నిస్తోంది.కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసేందుకు వారు తమిళిసైని కలవాలని అనుకున్నారు. అయితే అపాయింట్‌మెంట్ ఖరారు కాకపోవడంతో వారిని రాజ్‌భవన్‌లోకి అనుమతించలేదు.
దీంతో వారు అక్కడే ఆందోళనకు దిగారు. గవర్నర్ నుంచి ఎంతకీ సమాధానం లేకపోవడంతో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ.. రాజ్‌భవన్ గోడకు వినతిపత్రాన్ని అంటించారు. వీరి ఆందోళన నేపథ్యంలో రాకపోకలకు అంతరాయం కలగడంతో మేయర్ విజయలక్ష్మీతో పాటు ఎమ్మెల్యే గొంగిడి సునీత, బీఆర్ఎస్ కార్పోరేటర్లు, నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ మాట్లాడుతూ.. కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా మహిళా కార్పోరేటర్లు, బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగినట్లు విజయలక్ష్మీ తెలిపారు.
బండి సంజయ్ వ్యాఖ్యలపై గవర్నర్‌ను కలిసి వినతిపత్రం ఇవ్వాలని తామంతా రాజ్‌భవన్‌కు వచ్చినట్లు ఆమె వెల్లడించారు. బండి సంజయ్‌పై యాక్షన్ తీసుకునే అధికారం గవర్నర్‌కు వుందని మేయర్ స్పష్టం చేశారు.
ఉదయం నుంచి కూడా తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ నోరును ఫినాయిల్‌తో కడగాలని విజయలక్ష్మీ ఎద్దేవా చేశారు.
మాట్లాడితే హిందుత్వ అనే బండి సంజయ్‌కి భారతదేశంలో ఒక మహిళను ఎలా గౌరవిస్తారో, పూజిస్తారో తెలియదా అని ఆమె ప్రశ్నించారు. కవితతో పాటు యావత్ మహిళా లోకానికి బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలని గద్వాల్ విజయలక్ష్మీ డిమాండ్ చేశారు.
ఇటీవల బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. కవిత అరెస్ట్ అంశాన్ని ప్రస్తావించే క్రమంలో.. ‘కవితని అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా.’ అంటూ బండి సంజయ్ కామెంట్ చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కవిత వికెట్ పడిపోయిందని.. అతి త్వరలో బీఆర్ఎస్‌లో మరికొంతమంది క్లీన్ బౌల్డ్ అవుతారని అన్నారు. మద్యం కుంభకోణం, గ్యాంబ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు.
అయితే కవితపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని.. వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.