
తీవ్ర విషాదం.. మొక్కజొన్న గింజలు తింటూ మూడేళ్ల చిన్నారి మృతి..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంచుపల్లి మండలం రాంపురంలో తీవ్ర విషాదం నెలకొంది.
మొక్కజొన్న గింజలు తింటూ మూడేళ్ల చిన్నారి బిందుశ్రీ చనిపోయింది. ఊపిరితిత్తుల్లో మొక్కజొన్న గింజలు ఇరుక్కొవడంతో శ్వాస తీసుకోవడం ఇబ్బంది పడింది చిన్నారి బిందుశ్రీ. తల్లిదండ్రులు చిన్నారిని కాపాడేందుకు చేసిన ప్రయత్నం వృథా అయిపోయింది.
చిన్నారిని కాపాడేందుకు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఊపిరి ఆడక ఆ చిన్నారి ప్రాణాలు విడిచింది. ఈ ఘటనతో రాంపురంలో విషాద చాయలు అలుముకున్నాయి. తన చేతుల్లోనే చిన్నారి ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లిదండ్రుల రోధనలు మిన్నంటాయి. వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు.
వారిని బాధను చూసిన వారు సైతం కన్నీరు పెట్టుకుంటున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్నారిని మొక్కజొన్న గింజలకు బలవడం వారందరినీ కలిచివేస్తోంది.
గత కొన్నిరోజుల క్రితం వరంగల్ లో చిన్నారి సందీప్ సింగ్ సైతం.. గొంతులో చాకెట్ల్ ఇరుక్కోవడంతో శ్వాస తీసుకోవడంలో విలవిల లాడిపోయాడు. చివరకు మృత్యు ఒడికి చేరాడు.
తల్లిదండ్రులూ.. మీ చిన్నారులపట్ల అజాగ్రత్తగా ఉన్నారా? వారేం చేస్తున్నారో.. ఏం తింటున్నారో పట్టించుకోడం లేదా? అయితే ఇప్పుడు ఓ కన్నేసి ఉంచండి. ఎందుకంటే.. తినే పదార్థాలు కూడా చిన్నారుల ప్రాణాలు బలిగొంటున్నాయి.
పై ఉదంతమే ఇందుకు ఉదాహరణ. మొక్కజొన్న పొత్తులు తింటూ ముద్దులొలికే చిన్నారి మృత్యు ఒడికి చేరింది. అందుకే.. మీ చిన్నారులు తినే ఫుడ్డుపై కాస్త జాగ్రత్త వహించండి.