
గురుకులలో సైతం పాకిన ర్యాగింగ్ భూతం!
పాఠశాల విద్యార్థులపై సీనియర్ల దాడి
నాగర్‌కర్నూల్ జిల్లాలోని గురుకుల విద్యాలయంలో ఘటన
అచ్చంపేట : సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల విద్యాలయంలో పాఠశాల విద్యార్థులను బంధించి ఇంటర్ విద్యార్థులు దాడికి పాల్పడిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో చోటుచేసుకుంది.
రెండు రోజులుగా విద్యార్థులపై వరుస దాడులకు పాల్పడుతున్నా పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. చెప్పిన పనులు చేయడం లేదని 6 నుంచి 9వ తరగతి చదివే 20 మంది విద్యార్థులను ఇంటర్ విద్యార్థులు శనివారం రాత్రంతా ఓ తరగతి గదిలో నిర్బంధించి కర్రలతో కొట్టారు.
ఆదివారం సాయంత్రం మరోసారి వారిపై దాడికి పాల్పడ్డారు. బాధిత విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పడంతో సోమవారం వారు విద్యాలయానికి చేరుకొని ఆందోళన చేపట్టారు. ప్రిన్సిపల్, అధ్యాపకుల పర్యవేక్షణ లోపంతోనే రక్షణ కరవైందని, చర్యలు తీసుకోకుంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
దీంతో ప్రిన్సిపల్ లోకరాములు దాడికి పాల్పడిన ఆరుగురు విద్యార్థులను విద్యాలయం నుంచి పంపించేందుకు టీసీలు సిద్ధం చేస్తుండగా అధ్యాపకులు వారించారు. వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి కౌన్సెలింగ్ ఇద్దామని నిర్ణయించారు. అనంతరం బాధిత తల్లిదండ్రులు విద్యార్థులతో కలిసి విద్యాలయం ఆవరణలో బైఠాయించి నిరసన తెలిపారు.
విషయం తెలుసుకున్న రీజినల్ కోఆర్డినేటర్ వనజ విద్యాలయాన్ని సందర్శించి బాధిత విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. దాడికి గల కారణాలపై ఆరా తీసి,
ఇకముందు ఇలాంటివాటికి పాల్పడితే కఠిన చర్యలుంటాయని ఇంటర్ విద్యార్థులను హెచ్చరించారు. రెండు రోజులుగా దాడులు జరుగుతున్నా ఏం చేస్తున్నారని ప్రిన్సిపల్‌పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్ విద్యార్థులు సెల్‌ఫోన్లు వినియోగించడం తదితర అంశాలపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.