
అత్తమీద అలిగి కరెంట్ స్తంభం ఎక్కిన అల్లుడు.. కారణం తెలిస్తే షాకవుతారు..
పెళ్లిళ్లలో కట్నకానుకలు ఇవ్వడం ఆనవాయితీ. పెట్టుపోతల్లో మగ పెళ్లివారికి ఏ మాత్రం తక్కువ చేసిన అలకబూనడం కూడా షరా మామూలే. ఐతే పెళ్లి జరిగిన తర్వాత ఓ అల్లుడు తన అత్తింటి వారు బంగారం పెట్టలేదని అలిగి ఏకంగా కరెంట్ స్థంభం ఎక్కి మారాం చేశాడు.
తనకు బంగారం పెడితేనే కిందకి దిగుతానని.. లేదంటే కిందకి దిగేదిలేదని హల్‌చల్ చేశాడు. మెదక్ జిల్లాలో ఆదివారం (మార్చి 5) ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
గాంధీ నగర్‌కు చెందిన శేఖర్ ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. కొంత కాలం క్రితం శేఖర్ ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి జరిగిన తర్వాత తన అత్తగారు బంగారం పెట్టలేదని మనస్తాపం చెందాడు. దీంతో కరెంటు స్తంభం ఎక్కి కిందకు దిగనని హల్‌చల్ చేశాడు.
బంగారం పెట్టకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీన్ని గమనించిన స్థానికులు కరెంటు సరఫరాను నిలిపివేశారు. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని కింది దింపేందుకు ప్రయత్నించారు.
చాలా సేపటి వారిని ముప్పుతిప్పలు పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, డీఎస్పీ, సీఐ ఘటన స్థలానికి చేరుకుని శేఖర్‌కు బంగారం ఇప్పిస్తానని హామీ ఇవ్వడంతో దిగివచ్చాడు. అతను క్షేమంగా కిందకు రావడంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.