
మందు బాబులకు బిగ్ షాక్.. హోలీ కారణంగా ఆ రెండు రోజులు వైన్సులు బంద్.
హోలీ పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి హైదరాబాదీలు సిద్ధమవుతున్నారు. జంటనగరాల్లో హోలీ పండుగ జోష్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
యువకులు పెద్ద ఎత్తున రోడ్లపై సందడి చేస్తుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకొని పోలీసులు పటిష్ట చర్యలకు సిద్ధమయ్యారు. శాంతి భద్రతలకు ఎలాంటి భంగం కలగకూడదన్న ఉద్దేశంతో హైదరాబాద్‌లో వైన్స్ షాపులు మూసివేయాలని వైన్స్ నిర్వాహకులు పోలీస్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఇందులో భాగంగానే మార్చిన 6వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి 8వ తేదీ ఉదయం 6 గంటలకు వరకు మద్యం షాపులను మూసివేయనున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహన్ తెలిపారు. హోలీ పండుగని దృష్టిలో పెట్టుకుని వైన్స్షాపులను క్లోజ్ చేయిస్తున్నట్లు పేర్కొన్నారు.
నిబంధనలను ఉల్లంఘిస్తే యజమానులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ఇక మద్యం సేవించి బహిరంగ ప్రదేశాల్లో గొడవలను సృష్టిస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.
ఇదిలా ఉంటే హోలీ పండుగ నేపథ్యంలో ఎలాంటి అవంఛనీయ సంఘటనలు జరగకూడదన్న ఉద్దేశంతో ప్రతీ ఏటా మద్యం దుకాణాలను మూసేస్తుంటారు. ఇక ఈ ఏడాది ప్రజలు పోలీసులకు సహకరించాలని, ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలని చౌహన్ కోరారు.