
కొత్త పార్టీలో చేరికపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు..!!
తెలంగాణలో ఇప్పుడు పొంగులేటి ఎపిసోడ్ ఆసక్తి కరంగా మారుతోంది. పొంగులేటి బీఆర్ఎస్ వీడటం ఖాయమైంది. ఏ పార్టీలో చేరుతారనే దాని పైన కొంత కాలంగా చర్చలు జరుగుతున్నాయి
జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పొంగులేటి తన మద్దతు దారులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. వైఎస్సార్టీపీలో చేరుతున్నారని కొం కాలంగా ప్రచారం సాగుతోంది. కానీ, పొంగులేటి మాత్రం తాను ఏ పార్టీలో చేరే అంశాన్ని బయట పెట్టటం లేదు.
ముందుగా అన్ని నియోజకవర్గాల్లో తన ప్రభావం.. తనతో కలిసి వచ్చేదెవరనే అంశం పైన క్లారిటీ తీసుకుంటున్నారు. ఇదే సమయంలో అధికార బీఆర్ఎస్ పైన విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు పాలేరు కేంద్రంగా మరో సారి తన రాజకీయ భవిష్యత్ పైన కీలక వ్యాఖ్యలు చేసారు.
తాజాగా పాలేరులో పొంగులేటి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ పైన ఆరోపణలు గుప్పించారు. ధనిక రాష్ట్రమని చెప్పుకొనే తెలంగాణ ఇప్పుడు అప్పుల పాయిందని ద తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఉపాధి అవకాశాలు లేవన్నారు. రైతులకు ఇచ్చిన లక్ష రూపాయాల రుణ మాఫీ అమలు కాలేదని ఆరోపించారు.
రాష్ట్రం ఏర్పడితే బతుకులు బాగుపడతాయనుకుంటే పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారిందన్నారు. రాష్ట్రం కోసం బలిదానులు చేసుకున్న యువకుల త్యాగాలకు విలువ లేకుండా పోయిందన్నారు. ధనిక రాష్ట్రం కాస్త అప్పుల రాష్ట్రంగా మారిందని విమర్శించారు.
ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క వాగ్థానాన్ని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు.ఏ గ్రామంలోనూ 20 డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణం జరగలేదన్నారు. ప్రజలను ప్రభుత్వంలోని పెద్దలు మసి పూసి మారేడు కాయ చేస్తున్నారని ఆరోపించారు.
కేసీఆర్ విషయంలో ప్రజలు రెండు సార్లు మోసపోయారని..మూడోసారి ఎవరు మోసపోతారో వచ్చే ఎన్నికల్లో తెలుస్తుందని పొంగులేటి వ్యాఖ్యానించారు. గిరిజన బంధు , దళిత బంధు , డబుల్ బెడ్ రూం ఇండ్లలో లోపాలున్నాయన్నారు.
బడ్జెట్లో ప్రకటించినట్లుగా నిధుల కేటాయింపులు జరగడం లేదని పొంగులేటి చెప్పారు. ప్రజలకు మాయ మాటలు చెప్పి మళ్లీ అధికారంలోకి రావాలని ప్రభుత్వం భావిస్తుందని ఆయన ఆరోపించారు. బిల్లులు వచ్చేవి రావని తెలిసి కొంత మంది బీఆర్ఎస్ ను వీడి రాలేకపోతున్నారని ఆరోపించారు.
రాజకీయంగా నిర్ణయం తీసుకునే సమయంలో ఖచ్చితంగా ప్రకటిస్తానన్నారు. జెండా ఏదైనా అజెండా మాత్రం ఒక్కటేనని పొంగులేటి స్పస్టం చేసారు. ఎన్నికల సమయం వస్తోందని..ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని పొంగులేటి పిలుపునిచ్చారు