
కానిస్టేబుళ్లపై వాచ్‌మన్ సుత్తితో దాడి
మర్రిపాలెం: అపార్ట్‌మెంట్ వాచ్‌మన్ మద్యం తాగి డ్యూటీలో ఉన్న ఇద్దరి కానిస్టేబుళ్లపై దాడి చేశాడు. ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
ఎయిర్‌పోర్టు పోలీసులు తెలిపిన వివరాలివీ.. విమాన్‌నగర్ వద్ద సాయిప్రియ అపార్టుమెంట్‌లో రమ, ఆమె భర్త గోపి కాపలాదారులుగా పనిచేస్తున్నారు. గోపి రాత్రి సమయంలో ఓ పాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో పనిచేస్తున్నాడు. అతనికి మద్యం సేవించే అలవాటు ఉండడంతో తరచూ భార్యతో గొడవ పడుతున్నాడు.
రెండు రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. గురువారం రాత్రి కూడా గొడవ జరగడంతో.. ఆమె బయటకు వెళ్లి డయల్ 100కి ఫోన్ చేశారు. నైట్‌బీట్‌లో ఉన్న ఎయిర్‌పోర్టు కానిస్టేబుళ్లు కృష్ణారావు, కిశోర్ వారి నివాసం వద్దకు చేరుకున్నారు.
మద్యం మత్తులో ఉన్న గోపిని వివరాల కోసం విచారించారు. ఈ క్రమంలో గోపి కానిస్టేబుళ్లపై సుత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరికీ గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం సెవెన్ హిల్స్ ఆస్పత్రికి తరలించారు. ఘటనకు కారణమైన గోపిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఓ కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.