
నారాయణను లోపలేయించాడు- జగన్‌ను చూసి నేర్చుకోండి: కోమటిరెడ్డి..!!
హైదరాబాద్: శ్రీచైతన్య కళాశాల ఇంటర్మీడియట్ స్టూడెంట్ సాత్విక్ ఉదంతం పట్ల కాంగ్రెస్ కు చెందిన భువనగిరి లోక్ సభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
శ్రీచైతన్య కళాశాల వద్ద ఆయన నిరసన దీక్షకు దిగారు. అక్కడే బైఠాయించారు. సాత్విక్ తన సూసైడ్ నోట్ లో పొందుపరిచిన నలుగురు నిందితులను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. వారిని అరెస్ట్ చేసేంత వరకు తాను ఇక్కడి నుంచి కదలబోనని అన్నారు.
సిగ్గుతో తలదించుకోవాలి..
ఇవ్వాళ ఆయన నార్సింగి శ్రీచైతన్య కాలేజీకి వచ్చారు. ఆందోళనకు దిగారు. సాత్విక్ ఉదంతం తల్లిదండ్రులు, విద్యార్థులనే కాదు- సామాన్య ప్రజలకు కూడా కంటతడి పెట్టించిందని అన్నారు. స్వయంగా కళాశాల ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి, వార్డెన్, మరో ఇద్దరు సిబ్బంది సాత్విక్ ఒక్కరినే కాకుండా విద్యార్థులందరినీ హింసించారని ఆరోపించారు. ఇష్టానుసారంగా వేధింపులకు పాల్పడుతున్నట్లు సాత్విక్ తన లేఖలో పేర్కొనడం తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయమని కోమటిరెడ్డి చెప్పారు.
అనేక అనుమానాలు..
టీవీల్లో ఇచ్చే ప్రకటనలను చూసి పేద కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు తమ కుమారుడి భవిష్యత్తు కోసం శ్రీచైతన్య కళాశాలలో చేర్పించారని, అక్కడ వేధింపులకు గురి అయ్యాడని అన్నారు. విద్యార్థుల మీద భౌతికంగా దాడులకు దిగడం అమానవీయమని చెప్పారు. వేధింపులకు పాల్పడిన సిబ్బందిని ప్రభుత్వం ఇప్పటికీ అరెస్ట్ చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు.
పోలీసులతో భద్రత..
శ్రీచైతన్య కళాశాలకు ప్రభుత్వం పోలీసులతో భద్రతను కల్పించిందని కోమటిరెడ్డి ధ్వజమెత్తారు. కళాశాలకు 30-40 మంది పోలీసులు భద్రతగా మోహరించి ఉన్నారని, దీనికి అర్థం ఏమిటని కోమటిరెడ్డి నిలదీశారు. ఒక విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడేలా వేధింపులకు గురి చేసిన కళాశాల యాజమాన్యం, సిబ్బందిపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారని నిలదీశారు. నారాయణ, శ్రీచైతన్య కాలేజీ యాజమాన్యాలకు పోలీసులు అమ్ముడుపోయినట్లు ఉందని మండిపడ్డారు.
జగన్ ప్రభుత్వం..
అప్పులు, లోటు బడ్జెట్, పేద రాష్ట్రం, సమయానికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నప్పటికీ- ఏపీ ప్రభుత్వం విద్య రంగంపై భారీగా నిధులను ఖర్చు పెడుతోందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పేపర్ లీకేజీ కేసులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాహసోపేత నిర్ణయాలను తీసుకున్నారని, మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేయించారని గుర్తు చేశారు. నారాయణ అనే వాడు దొంగ అంటూ కోమటిరెడ్డి మండిపడ్డారు.
ఏపీలో ప్రభుత్వమే..
ఏపీలో ప్రభుత్వమే పాఠశాలలు, కళాశాలల నిర్వహిస్తోందని, నాణ్యమైన విద్యను పేద విద్యార్థులకు అందించడానికి వేల కోట్ల రూపాయలను వ్యయం చేస్తోందని కోమటిరెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంతో విద్యాబోధన అందిస్తోన్నారని గుర్తుచేశారు. విద్యారంగం మొత్తాన్నీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. పేదవాళ్ల ముంగిటికి చేర్చిందని ప్రశంసించారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులకు అమ్మఒడి పథకం కింద ఆర్థిక సహకారాన్ని అందిస్తోన్నారని చెప్పారు.
ట్విట్టర్లల్లో మాట్లాడటం కాదు..
పనికిరాని విషయాల మీద ట్విట్టర్ లో మాట్లాడే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్.. ఈ విషయంపై ఎందుకు స్పందించట్లేదని కోమటిరెడ్డి ప్రశ్నించారు. నిందితులను ఎందుకు వదిలిపెట్టారని, శ్రీచైతన్య, నారాయణలతో వారికి ఏం చుట్టరికం ఉందని ప్రశ్నించారు. నారాయణ, శ్రీచైతన్యల్లో చెత్త లెక్చరర్లు ఉన్నారంటూ కోమటిరెడ్డి ఆరోపించారు. లక్షల ఫీజులు చెల్లించిన తల్లిదండ్రులు రోడ్లపై కూర్చుంటున్నారని, విద్యార్థులను వేధిస్తోన్న కళాశాల సిబ్బంది ఏసీ రూముల్లో కాలక్షేపం చేస్తోన్నారని ధ్వజమెత్తారు.