
అగ్నిపరీక్ష.. ఆపై రూ. 11 లక్షల జరిమానా!
నిజాయతీ నిరూపణకు కులపెద్దల ఆటవిక చర్య
తొమ్మిది మందిపై కేసు నమోదు
ములుగు జిల్లాలో ఘటన
ములుగు : కంప్యూటర్ యుగంలోనూ ఆటవిక చర్యలు కొనసాగుతున్నాయనేందుకు ఇదో ఉదాహరణ.
ఓ వ్యక్తి నిజాయతీని నిరూపించుకోవడానికి నిప్పుల్లో కాలిన గడ్డపారను పట్టుకోవాలని హుకుం జారీ చేశారు కులపెద్దలు. అతడి చేతికి గాయాలైతే రూ. 11 లక్షలు జరిమానా కట్టాలన్నారు. గాయాలు కాకుండా బయటపడినా.. జరిమానా చెల్లించాల్సిందేనని వేధిస్తుండడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు.
ములుగు జిల్లా ములుగు మండలం బంజెరుపల్లిలో జరిగిన ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బంజెరుపల్లికి చెందిన జగన్నాథం గంగాధర్ ఒక వివాహితతో సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ కులపెద్దలు గత మూడు నెలల్లో 20 సార్లు పంచాయితీ నిర్వహించారు. తనకు సంబంధం లేదని నిరూపించుకోవడానికి పెద్దలు గంగాధర్‌కు అగ్నిపరీక్ష పెట్టారు.
అగ్నిలో కాలిన గడ్డపారను చేతులతో తీసి బయటపడేయాలన్నారు. గాయాలు కాకుంటే ఆమెతో సంబంధం లేదని నమ్ముతామని, గాయాలైతే జరిమానాగా రూ.11 లక్షలు చెల్లించాలని నిర్దేశించారు. దాని ప్రకారం గోవిందరావుపేట మండలం లక్నవరం చెరువు శిఖం ప్రదేశానికి వెళ్లి అక్కడ పెద్ద మనుషుల సమక్షంలో పిడకలతో అగ్నిగుండం ఏర్పాటు చేశారు.
గంగాధర్ చెరువులో స్నానం చేసి తడి దుస్తులతో వచ్చి తన చేతులతో గడ్డపారను అగ్ని గుండంలోంచి తీసి బయట పడేశాడు. ఈ క్రమంలో తనకు గాయాలు కాకపోయినా రూ.11 లక్షలు చెల్లించాలని వేధిస్తుండడంతో గంగాధర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అతడిపై తొలుత ఆరోపణ చేసిన నాగయ్యతో పాటు ఇరువైపులా ఉన్న పెద్ద మనుషులు కుంబం రాములు, జగన్నాథం సుంకయ్య, జగన్నాథం రాజయ్య, జగన్నాథం సాంబయ్య, దాసరి గంగయ్య, జగన్నాథం సమ్మయ్య, జగన్నాథం రాజయ్య, అనుము సమ్మయ్యలపై కేసు నమోదు చేసినట్లు ములుగు రెండో ఎస్సై లక్ష్మారెడ్డి తెలిపారు. పెద్ద మనుషులు తనకు ప్రాణహాని తలపెట్టే విధంగా వ్యవహరించారని గంగాధర్ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు.