
New Secretariat: కొత్త సచివాలయం ఉస్మానియా ఆసుత్రికి ఇచ్చేయాలట.. సీఎంకు డాక్టర్స్ అసోసియేషన్ లేఖ
New Secretariat: తెలంగాణ ప్రభుత్వం నిర్మాణం పూర్తి చేసి తొందరలోనే ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేస్తోన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయ భవనాన్ని ఉస్మానియా ఆసుపత్రికి కేటాయించాలంటూ హెల్త్‌కేర్ రీఫార్మ్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.
ఈ విషయమై తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ సైతం రాసింది. ఇక ఉస్మానియా ఆసుపత్రి కొనసాగుతున్న ప్రస్తుత భవనాన్ని సచివాలయానికి వాడుకోవాలనే సూచన సైతం చేసింది. ఉస్మానియా ఆసుపత్రి కోసం నూతన భవనాన్ని నిర్మిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీపై ఇప్పటికీ తమకు ఎలాంటి అధికార స్పష్టత రాలేదని, ప్రస్తుతం ఉన్న భవనంలో అరకొర సౌకర్యాల నడుమ రోగులకు వైద్యం చేయాల్సి వస్తోందని డాక్టర్స్ అసోసియేషన్ పేర్కొంది. ఆసుపత్రిలో రద్దీ చాలా ఎక్కువగా ఉందని, దీంతో రోగులు, వైద్యులు తీవ్ర అసౌకర్యాల్ని ఎదుర్కొంటున్నారని లేఖలో వాపోయారు. శిథిలమైన ప్రస్తత భవనం స్థానంలో నూతన భవనాన్ని నిర్మించడానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, అప్పటి వరకు ప్రస్తుత సచివాలయ భవనాన్ని ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి కేటాయించాలని విజ్ణప్తి చేశారు.