
దీక్ష శిబిరంలో గుండె నొప్పితో కుప్పకూలిన మహిళ
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా కల్లూరులోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ఐదురోజులుగా పేదలు రిలేనిరాహార దీక్షలు చేస్తున్నారు.
ఈ క్రమంలో ఆదివారం దీక్షలో ఉన్న సమయంలో ఓ మహిళ గుండెనొప్పితో కుప్ప కూలింది. ఐదురోజులుగా దీక్షలో కూర్చుంటున్న మహిళలు ఆదివారం కూడా ఉదయం 10-30 గంటలకు శిబిరం వద్ద కూర్చున్నారు.
ఈక్రమంలో మధ్యాహ్నం 12గంటల సమయంలో ఎండతీవ్రతకు దీక్ష చేస్తున్న కొమ్మ వెంకటనరసమ్మ అనే మహిళ గుండెనొప్పితో కిందపడింది. ఈ విషయం తెలుసుకున్న శిబిరం వద్దకు చేరుకున్న కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్ దీక్షా శిబిరం వద్దకు చేరుకుని కిందపడిన మహిళను పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి మెరుగ్గానే ఉందని తెలిసింది.
శిబిరం వద్దమానవతారాయ్ మాట్లాడుతూ పేదలు డబుల్ ఇళ్ల ఎంపికలో అక్రమాలు జరిగాయని, అర్హులైన వారిని న్యాయం చేయాలని ఐదురోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వానికి, పాలకులకు చీమ కుట్టినట్లుగా కూడా లేదని మండిప డ్డారు. బాధితులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ అండగా నిలుస్తుందన్నారు.