
పరువు హత్య.. తల, మొండెం వేరుచేసిన వైనం
కాపురానికి వెళ్లని కన్న కూతురును కడతేర్చిన తండ్రి
పాణ్యం గ్రామీణం : కుటుంబం పరువు తీసిందన్న కోపంతో కన్న తండ్రే కుమార్తెను దారుణంగా హతమార్చిన సంఘటన నంద్యాల జిల్లా పాణ్యం మండలంలో ఆలస్యంగా వెలుగుచూసింది.
పాణ్యం ఎస్సై సుధాకర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. ఆలమూరు గ్రామానికి చెందిన దేవేంద్రరెడ్డికి ఇద్దరు కుమార్తెలు సంతానం. పెద్ద కుమార్తె ప్రసన్న(21) కు రెండేళ్ల క్రితం ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీరుతో వివాహం జరిపించారు. వారు హైదరాబాద్‌లో నివాసం ఉండేవారు.
పెళ్లికి ముందే ప్రసన్న మరో వ్యక్తిని ప్రేమిస్తుండేది. అతనితో సాన్నిహిత్యం కారణంగా ఇటీవల హైదరాబాద్ నుంచి గ్రామానికి వచ్చేసిన ఆమె తిరిగి భర్త దగ్గరకు వెళ్లలేదు. దీంతో తన పరువు పోయిందని భావించిన తండ్రి దేవేంద్రరెడ్డి కూమార్తెపై కోపం పెంచుకున్నాడు. ఈనెల 10న ఇంట్లో గొంతు నులిమి హతమార్చాడు.
అనంతరం మరికొందరితో కలిసి మృతదేహాన్ని కారులో నంద్యాల- గిద్దలూరు మార్గంలో అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. తల, మొండెం వేరు చేసి తల ఒకచోట, మొండేన్ని మరోచోట పడేశారు. తిరిగొచ్చి ఏం తెలియనట్లు ఉన్నాడు. ఈ మధ్య మనవరాలు ఫోన్ చేయకపోవడంతో తాత శివారెడ్డికి అనుమానం వచ్చి ప్రసన్న ఎక్కడికి వెళ్లిందని ఆరా తీశారు.
దేవేంద్రరెడ్డిని గట్టిగా నిలదీయడంతో పరుపు పోయిందని కుమార్తెను చంపినట్లు తెలిపాడు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు గురువారం దేవేంద్రరెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రసన్న మృతదేహాన్ని పడేసిన ప్రాంతానికి తీసుకెళ్లారు. రోజంతా గాలించినా దొరకలేదు. శుక్రవారం మళ్లీ గాలించగా తల, మొండెం దొరికాయి. పోస్ట్‌మార్టం కోసం వాటిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.