
Ram gopal varma: చిన్నారిపై శునకాల దాడి… మేయర్ను ఆ కుక్కల మధ్య వదలండి: ఆర్జీవీ
అంబర్పేటలో జరిగిన వీధికుక్కల దాడి ఘటనపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని విమర్శిస్తూ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ వరుస ట్వీట్లు చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్: అంబర్పేటలో జరిగిన వీధికుక్కల దాడి ఘటనలో నాలుగేళ్ల బాలుడు ప్రదీప్ మరణించిన ఘటన అందరినీ తీవ్రంగా కలిచి వేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ (ram gopal varma) తనదైన శైలిలో స్పందించారు. విధి కుక్కల నియంత్రణలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) విఫలమైందంటూ విమర్శించారు. ‘శునకాలకు ఆకలి వేయడం వల్లే చిన్నారిపై దాడి చేశాయి’ అని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి (Gadwal Vijayalakshmi) ఇచ్చిన వివరణపై ఆర్జీవీ మండిపడ్డారు. ఆమెను విమర్శిస్తూ వరుస ట్వీట్లు చేశారు. గతంలో ఆమె తన పెంపుడు కుక్కతో కలిసి ఉన్న వీడియోను పంచుకుంటూ వ్యంగ్యంగా స్పందించారు.
“శునకాల నుంచి ప్రజలకు హాని కలగకుండా ఉండాలంటే మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి నా ఆలోచన చెబుతా. నగరంలోని అన్ని శునకాలకూ ఈ వీడియో చూపిస్తే, ఆకలి వేసినప్పుడల్లా, చిన్నారులపై దాడి చేయకుండా మేయర్స్ఇంటికి వెళ్తాయి. అలాగే, ఆ హృదయ విదారక వీడియోను ఆమెకు తరచూ చూపించాలి. అప్పుడే ఆమె చెత్త సలహాలు ఇవ్వకుండా ఉంటారు. కిల్లర్ డాగ్స్కు ఆమె నిజమైన నాయకురాలేమోనని నాకు
అనిపిస్తోంది. కేవలం మేయర్ మాత్రమే కాదు, అందరూ స్థానంలో మీ పిల్లలను ఊహించుకోండి. 2021లో గద్వాల్ విజయలక్ష్మి పెట్టిన వీడియో ఇప్పుడు 2023లో భయానక పరిస్థితికి చేరింది. చిన్నారిపై దాడి చేసిన శునకాలకు బహుశా ఆమే శిక్షణ ఇచ్చి ఉంటారన్న అనుమానం కూడా కలుగుతోంది. మంత్రి కేటీఆర్, హైదరాబాద్ పోలీసులు దీనిపై విచారణ చేయాలి. ఇంత జరిగినా ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ గద్వాల్ విజయలక్ష్మి తన మేయర్ పదవికి ఎందుకు రాజీనామా చేయకూడదు? ఆ రౌడీ/ గూండా కుక్కలను మీ ఇంటికి తీసుకెళ్లి వాటికి ఆహారం పెట్టవచ్చు కదా! అప్పుడు అవి మన పిల్లలను తినకుండా ఉంటాయి. కేటీఆర్ సర్ దయ చేసి నగరంలో ఉన్న 5లక్షల కుక్కలను డాగ్రము తరలించి, మధ్యలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని వదిలేయండి” అని ట్వీట్ చేశారు. అలాగే కుక్కల దాడి ఘటనపై హైకోర్టు స్పందించడాన్ని ఆర్జీవీ స్వాగతించారు.
చిన్నారిపై శునకాల దాడి నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. వీధి కుక్కలు, కోతుల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ప్రభుత్వ కార్యాచరణపై చర్చించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ట్వీట్ చేయగా, ‘మీరు ఈ విషయంలో ఏ నిర్ణయానికి వచ్చారు మేడమ్. జవాబుదారీగా ఉండటం కోసం ఆ వివరాలను ట్విటర్లో ఉంచగలరా’ అని ఆర్జీవీ ప్రశ్నించారు.