సీనియర్‌ వేధింపులు తాళలేక.. పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

Spread the love

సీనియర్‌ వేధింపులు తాళలేక.. పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

వరంగల్‌ ఎంజీఎంలో ఘటన.. నిమ్స్‌కు తరలింపు
వేధింపులపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తండ్రి ఆరోపణ

వరంగల్‌ : సీనియర్‌ వేధింపులు తట్టుకోలేక వరంగల్‌ ఎంజీఎంలో బుధవారం పీజీ వైద్య విద్యార్థిని ఒకరు ఆత్మహత్యాయత్నం చేశారు.

కాకతీయ వైద్యకళాశాలలో పీజీ మత్తు వైద్యం (అనస్థీషియా) మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని సీనియర్‌ పీజీ విద్యార్థి సైఫ్‌ కొన్నాళ్లుగా వేధిస్తుండడంతో తాళలేక ఆమె బలవన్మరణానికి యత్నించారు. వేధింపులపై కళాశాల, ఆసుపత్రి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు చర్యలు తీసుకోలేదని ఆమె తల్లితండ్రులు ఆరోపిస్తుండగా.. వేధింపులు నిజం కాదని అధికారులు ఖండిస్తున్నారు.

మరోవైపు ఆమె ఆరోగ్యపరిస్థితి అత్యంత విషమంగా ఉంది. జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి శివారు గిర్నితండాకు చెందిన ధరావత్‌ నరేందర్‌ నాయక్‌ వరంగల్‌ రైల్వేస్టేషన్‌ ఆర్పీఎఫ్‌ ఏఎస్సైగా పనిచేస్తున్నారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. మూడో కూతురు కాకతీయ వైద్య కళాశాలలో పీజీ చదువుతున్నారు. రెండు రోజుల కిందట తన సీనియర్‌ వేధిస్తున్నాడని ఆమె తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నరేందర్‌ ఆ విషయాన్ని వరంగల్‌ మట్టెవాడ పోలీసులకు తెలపగా వారు వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ మోహన్‌దాసుతో మాట్లాడారు.

తర్వాత ప్రిన్సిపల్‌ ఇతర వైద్యుల సమక్షంలో సైఫ్‌ను పిలిపించి మందలించారు. ఇది జరిగిన రెండు రోజులకే మంగళవారం రాత్రి ఎంజీఎం ఆసుపత్రి థియేటర్‌లో విధులు నిర్వర్తించిన ఆమె బుధవారం ఉదయం 6.30 గంటల సమయంలో అక్కడే ఉన్న గదిలో హానికరమైన ఇంజక్షన్‌ చేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. కాసేపటికి గుర్తించిన సిబ్బంది ఉన్నతాధికారులకు తెలిపారు. ఆమెకు గుండె ఆగిపోగా.. సీపీఆర్‌తో మళ్లీ పనిచేయించారు.

ఆర్‌ఐసీయూ వార్డుకు తరలించి ఎంజీఎం సూపరింటెండెంటు డాక్టర్‌ చంద్రశేఖర్‌, ఇతర వైద్యులు చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌ నిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. పీజీ వైద్యవిద్యార్థిని తండ్రి ఫిర్యాదు మేరకు మట్టెవాడ ఠాణాలో డాక్టర్‌ సైఫ్‌పై ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదైంది. అధికారులు మందలించినా సైఫ్‌ మంగళవారం రాత్రి కూడా ఆమెను వేధించినట్టు సమాచారం.

వేధింపులు అవాస్తవం

ఈ ఘటనపై ఎంజీఎం పర్యవేక్షకుడు డాక్టర్‌ చంద్రశేఖర్‌, కేఎంసీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ మోహన్‌దాసు మాట్లాడుతూ.. పీజీ వైద్యవిద్యార్థిని వేధించారనడంలో వాస్తవం లేదని తెలిపారు. రెండురోజుల కిందట విధుల్లో భాగంగా కేసు హిస్టరీ రాసే క్రమంలో తనకు బదులుగా మరో వైద్య విద్యార్థితో రాయిస్తుండగా సీనియర్‌ విద్యార్థి వారించారని, ఆ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని తెలిపారు. ఇద్దరినీ పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చామని, ఒకేచోట విధులు నిర్వహించకుండా మార్చామని పేర్కొన్నారు.

ప్రిన్సిపల్‌, హెచ్‌వోడీలకు చెప్పినా పట్టించుకోలేదు

తన కుమార్తె ఆత్మహత్యాయత్నం చేసిందని తెలియగానే తండ్రి నరేందర్‌ ఆసుపత్రికి వచ్చి భోరున విలపించారు. హైదరాబాద్‌ నిమ్స్‌ వద్ద కూడా ఆయన విలేకరులతో మాట్లాడారు. సైఫ్‌ మూడు నెలలుగా వేధిస్తున్నాడని తన కుమార్తె చెప్పిందని, తాను వచ్చి మాట్లాడతానంటే.. కక్ష కట్టి మార్కులు వేయరన్న భయంతో రావొద్దని వారించిందని తెలిపారు.

ఈ విషయమై ప్రిన్సిపల్‌, హెచ్‌వోడీతోపాటు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని నరేందర్‌ ఆరోపించారు. తీరా పోలీసుల దృష్టికి తీసుకెళ్తే, అలా ఎందుకు చేశారంటూ ఆ విభాగాధిపతి ప్రశ్నించారని చెప్పారు. తర్వాత కూడా సైఫ్‌ వేధింపులు ఆపలేదని, కావాలని తప్పులు వెతికేవారని, పని గంటలు పెంచారని ఆరోపించారు.

ఆమెను రోగుల ముందే సైఫ్‌ తీవ్ర పదజాలంతో దూషించేవాడని పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా.. విభాగాధిపతి, ప్రిన్సిపల్‌ కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. వారందరిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

2,121 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?