
ఎండలో విద్యార్థులకు… దండన
తల్లిదండ్రుల ఆగ్రహం
ఎండలో చెప్పులు లేకుండా నిలుచున్న విద్యార్థులు
ఇచ్చిన పాఠం సరిగా చెప్పలేదని విశాఖ నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులను ఎండలో చెప్పులు లేకుండా నిలబెట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇందుకు సంబంధించిన వివరాలు ఇవి.
సీతమ్మధారలోని లిటిల్‌గిగ్లెస్ పాఠశాలలో నాలుగు రోజుల క్రితం మూడో తరగతి విద్యార్థులకు గణిత పాఠ్యాంశం బోధించారు. మరుసటి రోజు తిరిగి ఆ పాఠంలోని ప్రశ్నలు వేసి విద్యార్థుల నుంచి సమాధానాలు రాబట్టేందుకు ప్రయత్నించారు. అయితే కొందరు విద్యార్థులు సరిగా చెప్పకపోవడంతో తరగతి గదిలో మోకాళ్లపై కూర్చోబెట్టి చదివించారు.
కాసేపటికి మళ్లీ సమాధానాలు అడగ్గా చెప్పలేకపోయారు. దీంతో మధ్యాహ్నం సుమారు 12.30 సమయంలో ఎండలో చెప్పులు లేకుండా పాఠశాల గేటు బయట విద్యార్థులను నిలబెట్టారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో బుధవారం కలకలం రేగింది.
విద్యార్థులను నిలబెట్టిన మాట వాస్తవమేనని.. అయితే రెండు నిమిషాలు మాత్రమే ఆ విధంగా ఉంచామని స్కూలు యాజమాన్యం తెలిపింది. ఈ వీడియో చూసిన పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి యాజమాన్యాన్ని నిలదీశారు. విషయం తెలుసుకున్న విద్యాశాఖ అధికారులు పాఠశాలకు వెళ్లి ఆరా తీశారు.
దీనిపై ఏపీ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు గొండు సీతారాం స్పందించి పిల్లలు చదవకుంటే ఈ విధంగా వ్యవహరించడం సరికాదని, ఘటనపై పాఠశాలను పరిశీలించి బాధ్యులపై తగు చర్యలు తీసుకుంటామన్నారు.
పాఠశాల యాజమాన్యానికి నోటీసులు
ఈ ఘటనపై విచారణ జరిపామని డీఈఓ చంద్రకళ తెలిపారు. ఉపవిద్యాశాఖాధికారి గౌరీశంకర్, ఎంఈఓతో కలిసి పాఠశాలను బుధవారం సందర్శించారన్నారు. పాఠశాల యాజమాన్యానికి నోటీసులు అందించారన్నారు. ‘మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలి’ అని పాఠశాల యాజమాన్యానికి తాఖీదు ఇచ్చామన్నారు.