
నియర్ నటుడు ప్రభు గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. తమిళ హీరో అయినప్పటికి.. డబ్బింగ్ చిత్రాలు, డైరెక్ట్ తెలుగు చిత్రాల్లో నటించడంతో.
తెలుగు వారికి కూడా సుపరిచితుడు. చంద్రముఖి, డార్లింగ్, శక్తి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు ప్రభు. ప్రస్తుతం ఇటు తెలుగులో, అటు తమిళంలో వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు ప్రభు. ఈ ఏడాది విడుదలైన తమిళ బ్లాక్ బాస్టర్ పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1లో కూడా ప్రభు నటించారు. ఇక తాజాగా విడుదలైన వారసుడు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ప్రభు. సినిమాలతో బిజీగా ఉన్న ప్రభు.. తాజాగా అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం సాయంత్రం ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు.. వెంటనే ఆయనను చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ వివరాలు..
ప్రభు గత కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని.. సమస్య తీవ్రం కావడంతో.. మంగళవారం చెన్నైలోని కేలంబాక్కంలోని మెడ్వే ఆసుపత్రిలో చేర్పించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రభుని పరీక్షించిన వైద్యులు యురేత్రోస్కోపీ లేజర్ సర్జరీ ద్వారా ఆయనకు మూత్రపిండాల్లో ఉన్న రాళ్లను తొలగించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. లేజర్ సర్జరీ ద్వారా కిడ్నీలో రాళ్లను తొలగించామని.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడుతున్నట్లుగా తెలిపారు. మరో రెండు రోజుల్లో ప్రభును డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు వెల్లడించారు.
ప్రభు ఆస్పత్రిలో చేరారనే వార్త తెలిసి ఆయన అభిమానులు తీవ్రంగా ఆందోళన పడుతున్నారు. తమ అభిమాన నటుడు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు. ప్రభు అనారోగ్యం గురించి తెలియడంతో.. పలువురు సినీ ప్రముఖులు ఆయన కుటుంబ సభ్యులను పరమార్శించి.. ధైర్యం చెబుతున్నారు. ప్రభు ఆరోగ్యం గురించి వాకబు చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
ప్రభు.. ప్రముఖ తమిళ నటుడు తిలకం శివాజీ గణేశన్ కుమారుడు. బాల్యంలోనే సినీ రంగ ప్రవేశం చేసిన ప్రభు.. బాలనటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుననారు. 1982లో తన తండ్రి శివాజీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన షంగిలి చిత్రంలో తొలిసారి హీరోగా కనిపించారు. మొదటి సినిమాతోనే తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించారు ప్రభు.. 80,90 దశకంలో హీరోగా ఓ వెలుగు వెలిగిన ప్రభు.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తున్నారు.
ప్రభు తమిళంలోనే కాక.. తెలుగులోనూ అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన డార్లింగ్ చిత్రంలో ప్రభాస్ తండ్రిగా నటించారు. అలాగే సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన చంద్రముఖి చిత్రంలోనూ కనిపించారు. ఆ తర్వాత శక్తి సినిమాలో కూడా కీలక పాత్రలో నటించారు. డైరెక్ట్, డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరిస్తుంటారు ప్రభు. ఆయన ఆస్పత్రిలో చేరారని తెలిసి అభిమానుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు