నాలుగేళ్ళ చిన్నారిని చంపేసిన వీధికుక్కలు.

Spread the love

Street Dogs Killed young Boy : నాలుగేళ్ళ చిన్నారిని చంపేసిన వీధికుక్కలు.

నాలుగేళ్ళ చిన్నారిని వీధి కుక్కలు చీల్చిచెండాడాయి. సెలవు రోజు తండ్రితో కలిసి వెళ్లిన బాలుడికి అదే చివరి రోజు అయ్యింది.

పనిచేసే చోటుకు పిల్లల్ని వెంటబెట్టుకుని వెళ్లిన కాసేపు ఆదమరవడంతో కుక్కలకు బలయ్యాడు. అప్పటి వరకు ఉత్సాహంగా ఆడుకున్న చిన్నారి క్షణాల్లో కుక్కలకు ఆహారంగా మారిపోయాడు.

తండ్రి పనిలో ఉండటంతో ఒంటరిగా సమీపంలోనే ఉన్న అక్క దగ్గరికి వెళ్లాలనుకున్న చిన్నారి వెంట వీధి కుక్కలు పడటంతో బెదిరిపోయాడు. వాటి బారి నుంచి తప్పించుకునేందుకు శక్తిమేర ప్రయత్నించినా లాభం లేకపోయింది.

జంతువులను వేటాడినట్టుగా కుక్కలన్నీ కలిసి చిన్నారిపై అన్ని వైపుల నుంచి దాడి చేయడంతో నిస్సహాయంగా శరీరాన్ని వాటికి అప్పగించి ప్రాణాలు కోల్పోయాడు. హృదయ విదారక ఘటన హైదరాబాద్‌లోని అంబర్‌పేట పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది.

నిజామాబాద్‌ జిల్లా ఇందల్‌వాయి మండల కేంద్రానికి చెందిన గంగాధర్‌ నాలుగేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వలస వచ్చాడు. అంబర్‌పేట ఛే నంబరు చౌరస్తాలో ఉన్న ఓ కారు సర్వీస్‌ సెంటర్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. భార్య జనప్రియ, ఆరేళ్ల కుమార్తె, నాలుగేళ్ల కుమారుడు ప్రదీప్‌లతో కలిసి బాగ్‌అంబర్‌పేట ఎరుకుల బస్తీలో నివాసం ఉంటున్నాడు.

ఆదివారం సెలవు కావడంతో గంగాధర్‌ పిల్లలిద్దర్నీ వెంట బెట్టుకుని తాను పని చేస్తున్న సర్వీస్‌ సెంటర్‌కు వచ్చాడు. కుమార్తెను పార్కింగ్‌ ప్రదేశం వద్ద ఉన్న క్యాబిన్‌లో ఉంచి, కుమారుడిని సర్వీస్‌ సెంటర్‌ లోపలికి తీసుకెళ్లాడు. కుమారుడు అక్కడే ఆడుకుంటూ ఉండటంతో మరో వాచ్‌మన్‌తో కలిసి పని మీద బయటకు వచ్చాడు. కాసేపు అక్కడే ఆడుకున్న ప్రదీప్‌, తర్వాత అక్క కోసం క్యాబిన్‌ వైపు నడుచుకుంటూ వస్తుండగా వీధి కుక్కలు వెంటపడ్డాయి.

భయపడిన బాలుడు వాటి నుంచి తప్పించుకునేందుకు అటు ఇటూ పరుగులు తీసినా అవి వదల్లేదు. ఒకదాని తర్వాత ఒకటిగా బాలుడిపై దాడిచేశాయి. ఒక దశలో ఓ కుక్క కాలు..మరొకటి చేయి నోటకరచుకుని చెరోవైపు లాగడంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. తమ్ముడి ఆర్తనాదాలు విని అక్కడికి వచ్చిన ఆరేళ్ల సోదరి.. పరుగున వెళ్లి తండ్రికి సమాచారమిచ్చింది. గంగాధర్ వచ్చి అదిలించడంతో కుక్కలు బాలుడిని వదిలేశాయి. తీవ్ర గాయాలపాలైన కుమారుడిని తండ్రి ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు

5,369 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?